చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూర్ నుంచి పోటీ చేసిన ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. 35 ఏండ్ల రాజకీయ జీవితంలో స్టాలిన్‌కు ఇదే తొలి ఓటమి. ఈ ఎన్నికల్లో బాబుకు 82,997 ఓట్లు వచ్చాయి. స్టాలిన్‌పై 8,795 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. స్టాలిన్‌కు 74,202 ఓట్లు రాగా అన్నాడీఎంకేకు చెందిన సంతాన క్రిష్ణన్‌కు 18,430 ఓట్లు వచ్చాయి. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన స్టాలిన్ నాలుగుసార్లు థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి, మూడుసార్లు కొళత్తూర్ నుంచి గెలిచారు. స్టాలిన్‌పై గెలిచిన బాబు డీఎంకే మాజీ నేత కావడం గమనార్హం.
చాలాకాలంపాటు డీఎంకేలో ఉన్న బాబు 2006 నుంచి 2011 వరకు పురుషవాకం ఎమ్మెల్యేగా చేశారు. 2011 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పునర్విభజనలో రద్దయింది. అదే సమయంలో బాబు ప్రభావం ఎక్కువగా ఉన్న కొళత్తూర్‌లో స్టాలిన్ పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మెజారిటీ తక్కువగా రావడంతో బాబును ప్రశ్నించారు. దీంతో బాబు అన్నాడీఎంకేలో చేరారు. 2026 ఫిబ్రవరి 7న టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం బాబు మాట్లాడుతూ ఈ విజ యం దళపతి విజయ్‌దేనని అన్నారు.