Free Wifi | అలిగి ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మాయిని ఫ్రీ వైఫై పట్టించింది. మొబైల్లో సిమ్ కార్డు ఉంటే తన లొకేషన్ ట్రేస్ చేస్తారని భావించిన ఆమె.. సిమ్ తీసేసి తనకు నచ్చినట్లుగా వెళ్లిపోయింది. కానీ రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్లేసుల్లో ఆమె ఫ్రీ వైఫైని వాడుకోవడంతో దాని ఆధారంగా పోలీసులు ఆచూకీ కనిపెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక చదవడం లేదని వాళ్ల అమ్మ ఇటీవల మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె పరీక్ష ఉందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా కలవకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాలతో అదృశ్యమైన బాలికను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.
దాదాపు 12 రోజుల పాటు హారిక కోసం పోలీసులు వెతికారు. కానీ తన లొకేషన్ దొరక్కూడదని భావించిన హారిక మొబైల్లో ఉన్న సిమ్ కార్డును తీసి పడేసింది. ఎలాంటి కాల్ ట్రేసింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. దీంతో హారిక ఆచూకీని కనిపెట్టడం పోలీసులకు కష్టమైంది. అయితే హారిక వెళ్లిన సమయంలో రైల్వే స్టేషన్లలో పబ్లిక్ వైఫై, ఫ్రీ వైఫైని వాడుకోవడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయగలిగారు. బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో తిరుగుతూ అక్కడి ఫ్రీ వైఫైని వాడుకుంటూ వెళ్లింది. దీంతో ఆమె ఎక్కడెక్కడ ఫ్రీ వైఫైని వాడుకుందనే దానిని టెక్నికల్ టీమ్ విశ్లేషించి.. ఆమె ఎటు వెళ్తున్నదో ఆ మార్గాన్ని అంచనా వేశారు. దానికి అనుగుణంగా వెళ్లిన పోలీసులు రాజమండ్రిలో హారికను గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. మొండికేసింది. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి.. సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.