ముందు ఇవన్నీ నేను నమ్మలేకపోయా. కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్‌కు గురయ్యా. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదనిపించింది. మిస్ వరల్డ్ పోటీలు విలువలతో ఉంటాయని భావించి వచ్చా. అయితే ఇక్కడ అలా లేదు. గతంలో జరిగినట్టే ఇంకా కొనసాగుతున్నది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో ‘నేనేమైనా వేశ్యనా’ ఏంటి? అనే భావన కలిగింది.
– ప్రఖ్యాత ‘ది సన్’ పత్రికతో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ
Milla Magee | హైదరాబాద్, మే 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఆమె పేరు మిల్లా మ్యాగీ . వయసు 24 ఏండ్లు. వృత్తిరీత్యా స్విమ్మర్. ప్రపంచ సుందరి కిరీటాన్ని ముద్దాడాలని చిన్నప్పటి నుంచి ఆమెకు ఎంతో ఆశ. ఆ దిశగానే ఎన్నో కలలుగన్నది. తన మనసులో మాటను తల్లికి కూడా చెప్పింది. అది విన్న మ్యాగీ తల్లి.. బిడ్డా.. అందాల పోటీ అంటే శారీరక సౌందర్యాన్ని మాత్రమే చూస్తారని అనుకోవద్దు. ఆత్మవిశ్వాసం, సేవాగుణం, స్ఫూరిని రగిలించే మంచి ప్రవర్తన, నడవడిక, చురుకైన ఆలోచనలు ఇలా అన్నీ మనలో ఉండాలి అంటూ మ్యాగీ కి చెప్పింది. తల్లి మాటలు మ్యాగీ పై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. అందుకుతగ్గట్టే తన ఉన్నత విద్య ముగియగానే 2024లో మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. దీంతో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో ఇంగ్లండ్ తరుఫున పాల్గొనడానికి ఈ నెల 7న నగరానికి వచ్చింది. అయితే పదిరోజులు తిరక్కముందే మే 16న పోటీల నుంచి వైదొలుగుతూ ఇంగ్లండ్‌కు వెళ్లిపోయింది.
వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా పోటీల నుంచి వైదొలుగుతున్నట్టు మ్యాగీ తొలుత ప్రకటించింది. మిస్ వరల్డ్-2025 పోటీల నుంచి వైదొలుగుతున్నట్టు మ్యాగీ ప్రకటించడం ఒక్క ఇంగ్లండ్‌లోనే కాదు యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. 72 ఏండ్ల ప్రపంచ సుందరి పోటీల్లో ఇంగ్లండ్ నుంచి ఓ పోటీదారు కాంపిటీషన్ మధ్యలోనే వైదొలగడం ఇదే మొదటిసారి. దీంతో ఇంగ్లండ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది సన్’ పత్రికకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పాల్ సిమ్స్.. పోటీ నుంచి నిష్క్రమించడానికి గల కారణాలను మ్యాగీ ని అడిగి తెలుసుకొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మ్యాగీ ‘మిస్ వరల్డ్ పోటీలు’ నిర్వహణ తీరు, ప్రతినిధుల వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ది సన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్లా మ్యాగీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనడానికి మే 7న నగరానికి చేరుకున్నట్టు చెప్పారు. పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు పాత కాలం తరహాలో, అధ్వానంగా ఉన్నట్టు వాపోయారు. పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు 109 దేశాలకు ప్రతినిధులన్న సంగతిని కూడా నిర్వాహకులు మరిచిపోయారని మండిపడ్డారు. తమతో దారుణంగా వ్యవహరించేవారని వెల్లడించారు. తమను ఎగ్జిబిషన్లో గ్లామర్ బొమ్మలుగా ట్రీట్ చేస్తూ 24 గంటలపాటూ మేకప్, బాల్ గౌన్లతోనే ఉండమంటూ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చేవారని వాపోయారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేప్పుడు కూడా మేకప్‌తోనే ఉండాలంటూ చెప్పేవారని తెలిపారు. మధ్యవయస్కులైన పురుషుల ముందు తమను పరేడ్ చేయించేవారని వాపోయారు.
డబ్బు ఉన్న కొందరు ధనవంతులు కూర్చున్న టేబుల్ల దగ్గర తమను గంటలపాటు ఉండాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చారని, ఆరుగురు కూర్చున్న ఒక్కో టేబుల్ వద్ద ఇద్దరేసి పోటీదారులు ఉండేవారని గుర్తుచేశారు. ఆ ధనవంతులు ఏం చెప్పినా తాము కృతజ్ఞతలు చెప్తూ రాత్రంతా ఆ టేబుల్ల దగ్గరే ఉండాల్సి వచ్చిందని వాపోయారు. ముందు ఇవన్నీ నేను నమ్మలేకపోయా. జరుగుతున్న పరిణామాలతో షాక్‌కు గురయ్యా. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదు అనిపించింది. మిస్ వరల్డ్ పోటీలు విలువలతో ఉంటాయని భావించి వచ్చా. అయితే ఇక్కడ అలా లేదు. గతంలో జరిగినట్టే ఇంకా కొనసాగుతున్నది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేశ్యనా ఏంటి? అనే భావన నాకు కలిగింది అని మ్యాగీ భావోద్వేగానికి లోనయ్యారు.
భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచి ఏదో సాధించాలన్న ఆశతో తాను ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చానని ‘ది సన్’ ఇంటర్వ్యూలో మ్యాగీ అన్నారు. కానీ ఊహించని అనుభవాలు తనకు ఎదురయినట్టు వాపోయారు. ఆటబొమ్మలను ఆడించినట్టు తమను ఆడిస్తూ, ‘కొందరిని హ్యాపీ’గా ఉంచాలని నిర్వాహకులు తాపత్రయపడ్డారని మ్యాగీ మండిపడ్డారు. దీంతో తాను ఉండలేకపోయానని తెలిపారు. తామిచ్చిన ప్రదర్శనలు బోరింగ్‌గా ఉన్నాయంటూ ఓ మహిళా నిర్వాహకురాలు తన మర్యాదకు భంగం కలిగించే విధంగా దురుసుగా మాట్లాడినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఓ దేశానికి ప్రతినిధులమన్న విషయాన్ని కూడా మరిచి ఎంతో అమర్యాదగా పిల్లలతో ప్రవర్తించినట్టు తమతో మసులుకొన్నారని వాపోయారు.
ఈ అనైతిక వ్యవహారం నచ్చకపోవడం వల్లే పోటీల నుంచి వైదొలిగినట్టు తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ మిస్ వరల్డ్ పోటీల్లో ఏ మార్పు రాలేదని, 1960, 70లలో అందాల ప్రదర్శనలా ఈ పోటీలు ఎలా జరిగేవో ఇప్పుడు కూడా శారీరక ప్రదర్శనకు ప్రాధాన్యం ఇస్తూ పోటీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆస్కార్ వేడుకల్లో విభిన్న వస్ర్తాలతో ఎలా హొయలుపోతారో మిస్ వరల్డ్ పోటీలు కూడా అలాగే తయారయ్యాయని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు చేయడం అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. మ్యాగీ ఆరోపణలతో హైదరాబాద్ ప్రతిష్ఠ పెరగడం సంగతి పక్కనపెడితే, మొత్తంగా పోటీల అస్తిత్వం, నగర ఖ్యాతి దెబ్బతిన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘మిస్ వరల్డ్’ పోటీల నిర్వహణ ద్వారా ప్రభుత్వం చెప్పినట్టు అంతర్జాతీయ కంపెనీల నుంచి తెలంగాణకు పెట్టుబడుల వరద వచ్చిపడటం ఏమోకానీ, హైదరాబాద్, తెలంగాణ ప్రతిష్ఠ అభాసుపాలయిందని మేధావులు చర్చించుకొంటున్నారు.
పోటీల నిర్వాహకులు ఎవరైనా, కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడంతో నగరానికి ఇదో మాయని మచ్చగా మారినట్టు చెప్తున్నారు. మ్యాగీ ఇప్పటికే మిస్ ఇంగ్లండ్ కిరీటాన్ని కైవసం చేసుకొన్నారు. అలాంటి మహిళ భరించలేని స్థాయిలో ఆవేదన కలిగిందంటే కారణాలను వెదకాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కార్యక్రమ నిర్వాహకులెవరు? ఆ వ్యవహారం మన సంస్కృతీ, సంప్రదాయానికి సరిపోతుందా? లేదా? అనే విషయాన్ని ప్రభుత్వం కూడా చూడాల్సిందని చెప్తున్నారు. ఇప్పటికైనా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ప్రభుత్వం తరుఫున లేఖలు రాయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు.
యూకేలో టాబ్లాయిడ్ జర్నలిజం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు నకిలీ పోస్టులు కూడా వైరల్‌గా మారుతాయి. దీంతో మ్యాగీ పై ప్రచురించిన కథనం నిజమో? కాదో? తెలుసుకోవడానికి ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ఆమెను సంప్రదించారు. దీంతో హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో తాను భయానక అనుభవాలను ఎదుర్కొన్నట్టు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఒప్పుకొన్నారు. అందాల పోటీ అంటే శారీరక సౌందర్యాన్ని మాత్రమే చూడరని మా అమ్మ చెప్తుంది. మహిళలోని ఆత్మవిశ్వాసం, సేవాగుణం, స్ఫూర్తి, ప్రవర్తన, నడవడిక, చురుకైన ఆలోచనలు ఇలా అన్నీ చూస్తారని చెప్పేది.
అమ్మ చెప్పిన మాటలకు, హైదరాబాద్‌లో పోటీల తీరుకు చాలా తేడా ఉంది. నిర్వాహకులు నా పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు. వాళ్ల వ్యవహారంతో కొన్ని రోజులపాటు నిద్ర కూడా పట్టలేదు. పోటీల నుంచి వైదొలగబోతున్నట్టు ముందుగానే అమ్మకు చెప్పేశా. ఇంగ్లండ్ చేరుకోగానే అమ్మను పట్టుకొని ఏడ్చేశా. నన్ను, ఇతర పోటీదారులను ఓ అంగడి సరుకుగా చూశారని నా బాధను అమ్మతో చెప్పుకొన్నా అంటూ మ్యాగీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ది సన్’లో వచ్చిన కథనం నిజమేనని ధ్రువీకరించారు.
మిస్ వరల్డ్ పోటీల నుంచి మ్యాగీ వైదొలగడంతో మిస్ ఇంగ్లండ్ 2024 రన్నరప్ చార్లొటే గ్రాంట్ (25)ను ఇంగ్లండ్ నుంచి పోటీల్లో నిలిపినట్టు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. వచ్చే శనివారం ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీల పేరిట దేశ పరువు తీసిందని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న మిస్‌వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ వైదొగులుతూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె తనను వేశ్యలా చూశారని, పోటీదారులా గౌరవించకుండా షోపీస్‌లా చేశారని చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ సర్కారు మిస్‌వరల్డ్ పోటీల నిర్వహణలో ఎంత ఘోరంగా విఫలం చెందిందో తెలిసిపోయిందని విమర్శించారు. స్త్రీలను గౌరవించే దేశమని చెప్పుకునే భారత్‌కు.. ప్రపంచంలో ఉన్న గుర్తింపును కాంగ్రెస్ సర్కారు దుర్మార్గపు చర్యలతో మంటగలిపిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల సొమ్ము రూ. 250కోట్లు దుబారా చేసి మరీ.. భారత్ పరువును గంగలో కలిపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో యూకేలోని ప్రవాసీ తెలంగాణవాసులు ఎంతో బాధపడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అనవసరపు ఆర్భాటాలకు పోకుండా.. ప్రజలకు మంచి చేయాలని ఆయన హితవు పలికారు.
అమ్మ చెప్పిన మాటలకు హైదరాబాద్‌లో జరుగుతున్న పోటీల తీరుకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. నిర్వాహకులు నా పట్ల వ్యవహరించిన తీరు ఎంతో దారుణంగా ఉండేది. అది నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ల వ్యవహారంతో కొన్ని రోజులపాటు నిద్రకూడా పట్టలేదు. పోటీల నుంచి వైదొలుగబోతున్నట్టు ముందుగానే అమ్మకు చెప్పేశా. ఇంగ్లండ్ చేరుకోగానే అమ్మను పట్టుకొని ఏడ్చేశా. నన్ను, ఇతర పోటీదారులను ఓ అంగడి సరుకుగా చూశారని నా బాధను అమ్మతో చెప్పుకొన్నా.
– ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ
ముందు ఇవన్నీ నేను నమ్మలేకపోయా. కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్‌కు గురయ్యా. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదు అనిపించింది. మిస్ వరల్డ్ పోటీలు విలువలతో ఉంటాయని భావించి వచ్చా. అయితే ఇక్కడ అలా లేదు. గతంలో జరిగినట్టే ఇంకా కొనసాగుతున్నది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో ‘నేనేమైనా వేశ్యనా’ ఏంటి? అనే భావన నాకు కలిగింది.
-ప్రఖ్యాత ‘ది సన్’ పత్రికతో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ
మిస్ ఇంగ్లండ్ మ్యాగీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. అసంబద్ధమైనవి. యూకే పత్రికా కథనాలు వాస్తవ దూరం. అవి మిస్ వరల్డ్ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయి. భారత్‌లో పోటీ జరుగుతున్న సమయంలో మ్యాగీ చాలా సంతోషంగా ఉన్నారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేశాం. తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని మ్యాగీ చెప్పడంతోనే పోటీల నుంచి వైదొలగడానికి ఆమెకు అనుమతినిచ్చాం.
-జూలీ మోర్లే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో, చైర్పర్సన్