బీబీనగర్, జూలై 12 : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ‘సర్’ అప్లికేషన్ కోసం ఫొటో తీస్తామని నమ్మించి గుర్తుతెలియని దుండగులు ఓ మహిళకు చెందిన సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. బీబీనగర్ పట్టణానికి చెందిన కుక్కుదోవు అండాలు వద్దకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ప్రభుత్వ ‘సర్’ అప్లికేషన్ కోసం ఫొటో తీస్తామని చెప్పి, ఫొటోలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మెడలో ఉన్న పుస్తెలతాడును తీసి భర్తకు ఇవ్వాలని సూచించారు.
వారి మాటలు నమ్మిన మహిళ పుస్తెలతాడును తీసి తన భర్త చేతికి ఇచ్చింది. అనంతరం మహిళను ఫొటో తీసిన దుండగులు, అప్లికేషన్ను సమీపంలోని ఆలయం వద్ద ఉన్న అధికారుల వద్ద పూర్తి చేయాలని చెప్పి ఆమెను అక్కడి నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. ఇదే సమయంలో వెనక్కి తిరిగిన దుండగులు ద్విచక్ర వాహనంపై మహిళ భర్త వద్దకు చేరుకుని అతని చేతిలో ఉన్న బంగారు పుస్తెలతాడును తీసుకుని పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.