న్యూఢిల్లీ : కేంద్ర మోటరు వాహనాల నిబంధనలను సమూలంగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలతోపాటు, గాలి కాలుష్యాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు చేసింది. ముసాయిదా ప్రకారం, కమర్షియల్ వాహనాల మాదిరిగానే, ప్రైవేట్ వాహనాల యజమానులు కూడా తమ వాహనాలను ఫిట్నెస్, పొల్యూషన్ తనిఖీల కోసం ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లకు తీసుకెళ్లాలి.
ముఖ్యంగా 15 ఏండ్లు పైబడిన వాహనాలకు ఇక్కడ ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయాలంటే చెల్లుబాటయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఇలా తనిఖీలు చేయించాలి. వాహనాలకు పరీక్షలు నిజాయితీగా జరిగినట్లు నిరూపించడానికి డిజిటల్ చెక్‌ను నోటిఫికేషన్ ప్రతిపాదించింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీకి ముందు తనిఖీ అధికారి తప్పనిసరిగా ఆ వాహనం జియోట్యాగ్డ్ వీడియోను అప్లోడ్ చేయాలి.