ఖైరతాబాద్, డిసెంబర్ 14 : కృష్ణం వందే జగద్గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి పురస్కరించుకొని ఎన్టీఆర్ గ్రౌండ్లో కోటి భగవద్గీతోత్సవం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. మానవ సమాజం ప్రశాంతంగా మానసిక స్థితిని పెంపొందించుకొని మంచి జీవనాన్ని సాగించాలంటే భగవద్గీత పారాయణమే ఏకైక మార్గమన్నారు. భగవద్గీతను గడప గడపకు చేర్చాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కనకరాజు యాదవ్, గంట రాములు యాదవ్, సాయికుమార్, వెంకట్ తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.