బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 13 : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించతలపెట్టిన ఆత్మగౌరవ సౌధాలు దశల వారీగా లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇందులో భాగంగా సనత్‌నగర్ నియోజకవర్గం బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రూనగర్ బస్తీలో రూ.20.64 కోట్లతో నిర్మించిన 264 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 17న ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ విజయలక్ష్మి హాజరవుతారన్నారు.
ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మారెడ్‌పల్లిలోని ఆయన నివాసంలో హౌజింగ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ ఆధికారులతో పాటు లబ్ధిదారులతో విడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా రెవెన్యూ, హౌజింగ్ శాఖల అధికారులు ప్రత్యేకంగా బస్తీ సభలను ఏర్పాటు చేసి అందరి సమక్షంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ కె.హేమలత, ఆర్డీఓ వసంత కుమారి, డీసీ ముకుందరెడ్డి, హౌజింగ్ ఈఈ వెంకట్‌దాస్ రెడ్డి, సికింద్రాబాద్ తాసీల్దార్ బాలశంకర్, టీఆర్ఎస్ నాయకులు జి.పవన్‌కుమార్, కె.లక్ష్మీపతి, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.