అమీర్‌పేట్, డిసెంబర్ 13: సుభాష్‌నగర్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సనత్‌నగర్ సుభాష్‌నగర్‌లో రూ.31 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుభాష్‌నగర్‌ను సకల వసతులతో చక్కటి కాలనీగా తీర్చిదిద్దేందుకు నిధుల లోటు లేకుండా చూస్తానన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఇండ్ల మీద నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదానికి గురై, పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారని అన్నారు.
తాను ఎమ్మెల్యేగా వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకురావడం ద్వారా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బస్తీల్లో ప్రాణాంతకమైన హైటెన్షన్ విద్యుత్ తీగల సమస్యను భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుతో పరిష్కరించామన్నారు. పురాతన డ్రైనేజీ, మంచినీటి, రోడ్ల వ్యవస్థలను ఆధునీకరించినట్లు తెలిపారు. తాజాగా వారం రోజుల క్రితం ఇక్కడి ప్రజల నీటి కష్టాలు తీరేలా పవర్ బోర్ నిర్మాణాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ ఈఈ మోహన్ యతీంద్ర, టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, సమీరుల్లా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.