
మాదాపూర్, డిసెంబర్ 15: చేనేత కార్మికులకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మాదాపూర్‌లోని శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్ మేళా ప్రారంభోత్సవానికి శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావుతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒకరు చేనేత వస్ర్తాలను ధరించాలని కోరారు.
దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు దాదాపు 200 మంది తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. క్రాఫ్ట్ మేళాలో 500 లకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నగరవాసులకు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత జౌళిశాఖ అధికారి అరుణ్‌కుమార్, నర్సింహులు, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.