హైదరాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ) ; తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమార స్వామిని కలిసి వినతి పత్రం సమర్పించారు. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా జాతీయ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి గణనీయంగా దోహదపడాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.
పెద్దపల్లిలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్ సీఎల్) విజయవంతంగా నడుస్తున్నదని, ఇదే మాదిరిగా ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఐఎల్)ను కూడా పునరుద్ధరిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికాభివృద్ధికి మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. అలాగే స్థానిక ప్రజలకు ఉపాధి కూడా లభిస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.