నార్కట్పల్లి, ఏప్రిల్ 19: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నిరుపేదకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిమిత్తం రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన బందెల గిరిబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దవాఖానకు వెళ్లగా గుండె మార్పిడి చేయాలని వైద్యులు సూచించడంతో ఖర్చులకు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నాడు. గిరిబాబుకు సాయం చేయాలని గ్రామ వార్డు మెంబర్ బొడిగె భరత్ ఈ నెల 6న మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విన్నవించాడు. మంత్రి వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షల ఎల్వోసీని మంజూరుచేశారు. మంగళవారం టీఆర్ఎస్ నాయకుడు బద్దం రాంరెడ్డి.. బాధితుడు గిరిబాబుకు ఎల్వోసీ పత్రం అందజేశారు. సాయం చేసిన మంత్రి కేటీఆర్కు గిరిబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.