Ponguleti Srinivas Reddy | (స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, దాని అనుబంధ కంపెనీలు తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయా? హవాలా మార్గంలో భారీఎత్తున సొమ్మును విదేశాలకు మళ్లించాయా? కాగితాల్లో మాత్రమే కనిపించే బోగస్ కంపెనీలను సృష్టించి ఆ ముసుగులో భారీ స్కామ్‌లకు తెగబడ్డాయా? చూపించిన ఆదాయానికి చెల్లించిన పన్నులకు ఎక్కడా పొంతన లేదా? ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఇవన్నీ నిజమేననిపిస్తున్నది. ముఖ్యంగా పొంగులేటి కుటుంబానికి చెందిన నివాసాలు, ఆఫీసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించడం, ఈడీకి ఎఫ్ఐయూ పక్కా సమాచారాన్ని ఇవ్వడాన్ని చూస్తే, పొంగులేటికి చెందిన కంపెనీలు తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అర్థమవుతున్నదని ఢిల్లీలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
ఏమిటీ ఎఫ్ఐయూ?
కేంద్ర రెవెన్యూ విభాగంలోని ఓ ప్రత్యేక డిపార్ట్మెంట్.. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ). మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 కింద రూ. 100 కోట్లకు పైబడిన ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను మాత్రమే ఈ విభాగం పర్యవేక్షిస్తుంది.
ఎఫ్ఐయూ సక్సెస్ రేట్ 99 శాతం
పొంగులేటి కుటుంబం కంపెనీలకు సంబంధించిన వివరాలు, ఆ కంపెనీల ఆర్థిక లావాదేవీలు, ష్యూరిటీ బాండ్లు, ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎఫ్ఐయూ సిబ్బంది ఈడీ అధికారులకు సమర్పించారు. దీనికి కారణం.. వివరాల సేకరణ, సమాచారం అప్పగింత వరకే ఎఫ్ఐయూకు అధికారాలు ఉన్నాయి. కేసుల విచారణ, సోదాలు కేంద్ర దర్యాప్తు సంస్థలే చూసుకోవాలి. ఈక్రమంలోనే ఎఫ్ఐయూ పొంగులేటి కుటుంబం కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈడీకి ఇచ్చింది. కాగా, ఎఫ్ఐయూ సేకరించిన సమాచారం 99 శాతం కేసుల్లో నిజమేనని తేలినట్టు ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు.
వందల కోట్ల కేసు..
రూ. 100 కోట్లకు పైబడిన ఆర్థిక నేరాల కేసులపైనే ఎఫ్ఐయూ దృష్టి సారిస్తుంది. ఈ లెక్కన పొంగులేటి కంపెనీల కేసు వందల కోట్లతో ముడిపడి ఉన్నట్టు స్పష్టమవుతున్నదని అధికారి ఒకరు పేర్కొన్నారు. శుక్రవారం ఈడీ జరిపిన సోదాల్లో మూడు, నాలుగు కౌంటింగ్ మెషీన్లు తీసుకెళ్లడాన్ని చూస్తే.. ఈ కేసు పరిధి రూ. 800 కోట్లు దాటొచ్చని ఆ అధికారి అంచనా వేశారు.