హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు డ్రామాలు కట్టి పెట్టి, కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో లేదో తేల్చి చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వానకాలం ధాన్యం కొనుగోలు చేస్తుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మూర్ఖంగా, అవివేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే రాష్ట్రంలో డ్రామాలాడుతూ, రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ రైతులకు ఎటువంటి సమస్య లేదని, బీజేపీయే పెద్ద సమస్య అని పేర్కొన్నారు. పర్యటనల పేరుతో రైతులు కష్టించి పండించిన ధాన్యం కుప్పలను చిన్నాభిన్నం చేయడం బాధాకరమని అన్నారు. నిరసనల పేరుతో రైతుల వద్దకు వెళ్లి భంగపడ్డారని, వారికి రైతుల నుంచి అవమానమే ఎదురైందని చెప్పారు. రైతులను ఇబ్బంది పెడితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
రైతుల గురించి మాట్లాడటానికి బీజేపీకి ఉన్న అర్హతలేమిటని ప్రశ్నించారు. రైతులకు నీళ్లిచ్చారా? కరెంట్ ఇచ్చారా? అని నిలదీశారు. ఉత్తరభారత్‌లో రైతులను రోడ్డుపాలు చేసి, వందల మందిని పొట్టనబెట్టుకున్న బీజేపీ నేతలకు సిగ్గూ శరం లేదని మండిపడ్డారు. ఏడాదిన్నరగా రైతులు రోడ్లపై దీక్ష చేస్తుంటే, ప్రధానమంత్రి మోదీ వారితో ఎందుకు మాట్లాడటం లేదని, సమస్యను పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రైతులకు క్షమాపణ చెప్పి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కయిందంటూ బీజేపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని, వాళ్లకేమైన సిగ్గూశరం ఉన్నదా? అని మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఎంత ధాన్యం కొనాలి? ఎంత బియ్యం ఇవ్వాలనేది ఎఫ్‌సీఐ మాత్రమే నిర్ణయిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమి ఉండదని స్పష్టంచేశారు. ఈ మాత్రం కూడా తెలియని వారు కేంద్రంలో అధికారం చెలాయిస్తూ.. రాష్ట్రంలో శకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్‌సీఐకి రా రైస్ అయితే 67 కేజీలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కేజీలు ఇవ్వాలని నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ కాదని పేర్కొన్నారు. కనీస అవగాహన లేకుండా బీజేపీ నేతలు సోషల్ మీడియాలో అసత్యపు, మూర్ఖత్వపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.