ముంబై, ఫిబ్రవరి 23: గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని బంధువులతో కలిసి అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. దావూద్, అతని బంధువులపై ఇప్పటికే నమోదు చేసిన మనీ ల్యాండరింగ్ కేసుతో మాలిక్‌కు సంబంధం ఉందని ఆరోపించింది. బుధవారం ఉదయం 6 గంటలకే ఈడీ అధికారులు నవాబ్ మాలిక్ ఇంటికి వెళ్లారు. 8 గంటలకు ఆయన్ను ముంబైలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. నవాబ్ మాలిక్‌కు కోర్టు మార్చి 3 వరకు ఈడీ కస్టడీ విధించింది. తాము అడిగిన ప్రశ్నలకు మాలిక్ నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకోజూశారని ఈడీ అధికారులు చెప్పారు. దావూద్, ముంబై పేలుళ్లలో దోషులతో నగదు లావాదేవీలు జరిపినందున ఆయనను ప్రశ్నించాల్సి ఉందన్నారు.
మేం పోరాడతాం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను, కేంద్ర దర్యాప్తు సంస్థల వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నవాబ్ మాలిక్ కొన్ని రోజులుగా వివాదాస్పద అంశాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ సమీర్ వాంఖడేపై అవినీతి ఆరోపణలు చేశారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నటుడు షారూక్ కుమారుడిని అరెస్టు చేసిన విధానంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈడీ అధికారులు అరెస్టు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను తలవంచేది లేదని తేల్చిచెప్పారు. ‘మేం పోరాడతాం. విజయం సాధిస్తాం. అన్నింటినీ బయటకు తీసుకువస్తాం’ అని వ్యాఖ్యానించారు.
గొంతు నొక్కేందుకే
నవాబ్ మాలిక్ అరెస్టుపై మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం భగ్గుమన్నది. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ప్రభుత్వంలోని పార్టీల నేతలు ఆరోపించారు. తమని విమర్శించేవారి గొంతునొక్కడానికి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొంటున్నదని మండిపడ్డారు. బీజేపీ దుశ్చర్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న మాలిక్‌పై ఇలాంటి చర్యలు ఉంటాయని తాము ముందుగానే ఊహించినట్టు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి ఉగ్రవాదులతో ముడి పెట్టడం, ఏవో కేసులను తిరగదోడటం, అప్రతిష్ట పాలు చేయడం జరుగుతున్నదని ఆరోపించారు. ముంబై పేలుళ్ల కేసులో 30 ఏండ్లుగా రాని నవాబ్ మాలిక్ పేరు ఇప్పుడే ఎందుకు వచ్చిందని ఎన్సీపీ, శివసేన పార్టీలు ప్రశ్నించాయి.
యుద్ధం ఇప్పుడే మొదలైంది
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక మాఫియాలాగా మారి బీజేపీ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకొంటున్నాయని సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్ర నేతలపై ఇలాంటి దాడులు 2024 ఎన్నికల వరకు కొనసాగుతాయని అన్నారు. అయితే 2024 తర్వాత బీజేపీ నేతలకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొనలేక బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడుస్తున్నదని ఆరోపించారు. ఛత్రపతి శివాజీని వెన్నుపోటు పొడిచిన అఫ్జల్ ఖాన్ గురించి ప్రస్తావించారు. హిందూత్వ పేరుతో బీజేపీ రాజకీయాలను దిగజార్చుతున్నారని సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘హిందూత్వ అంటే హింస, పగ కాదు. ఇది ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు ఏంటి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘అన్యాయంగా ఒక మంత్రిని అరెస్టు చేసి సంబురపడుతున్నారు. నవాబ్ మాలిక్ రాజీనామా చేయరు. మేం పోరాడతాం. కంసుడు, రావణుడు కూడా చనిపోయారు. ఇది హిందూయిజం. యుద్ధం ఇప్పుడే మొదలైంది’ అని ట్వీట్ చేశారు. కేంద్రం ముందు మహారాష్ట్ర ఎప్పటికీ తలవంచదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఈడీ కేవలం బీజేపీ వ్యతిరేకులపైనే దర్యాప్తు చేస్తుందని మండి పడ్డారు.‘ఇది బీజేపీ కక్ష సాధింపు’ అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ అన్నారు.
మమత, పవార్ చర్చ
నవాబ్ మాలిక్ అరెస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. బుధవారం సాయంత్రం ఆమె, శరద్ పవార్ ఫోన్లో మాట్లాడుకొన్నారు. ఇద్దరి మధ్య సంభాషణ 10 నిమిషాల పాటు సాగింది. ఎన్సీపీకి మమత తన మద్దతు ప్రకటించారు. దీనిపై విపక్షాలు కలిసి పోరాడాలని సూచించారు. ‘నవాబ్ మాలిక్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించి బీజేపీ ఆటలో పావులు కావొద్దు’ అని మమత పవార్‌తో అన్నట్టు సమాచారం. ఆమె సూచనకు అనుగుణంగా ‘మాలిక్ రాజీనామాను కోరబోం’ అని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.