శామీర్‌పేట, డిసెంబర్ 14 : ప్రజా శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం పరితపిస్తున్నారని, సీఎం వినతి మేరకు రైతులు యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కోరారు. శామీర్‌పేట మండలంలోని గ్రామాల్లో మంగళవారం రూ.కోటి నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
రైతుబంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్ వంటి ఎన్నో కార్యక్రమాలతో రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ముంచే విధంగా వ్యవహరిస్తుందని, రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ముందుచూపుతో యాసంగిలో వరి పంటకు బదులుగా కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు వేసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వినతి మేరకు వరికి బదులుగా వాణిజ్య, కూరగాయల సాగుపై రైతులు దృషి సారించాలన్నారు.
గత రెండేండ్లుగా కరోనా మహమ్మరి కారణంగా రాష్ట్రం ఆర్థికంగా నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందేనని, ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా కింద తనకు రూ.5 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఆ నిధులను జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున కేటాయించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. శామీర్‌పేట మండలంలోని 10 గ్రామాల్లో రూ. కోటితో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు భూమి పూజ చేశామన్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ.5 కోట్ల 50 లక్షలు వేయడం జరిగిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనిత లాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సరసం మోహన్‌రెడ్డి, సీహెచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంటీసీటీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ వేణుగోపాల్, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.జహంగీర్, మండల అధ్యక్షుడు సుదర్శన్, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు బి.నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.