ఘట్కేసర్, డిసెంబర్ 9 : మున్సిపాలిటీల పరిధిలో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ పరిధిలో 1.17 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను చైర్మన్ బి.కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో ఆశించిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
మున్సిపాలిటీల్లో రూ. 30 కోట్లు, కార్పొరేషన్లలో రూ.70 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు కావల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో రూ.30లక్షలతో బీటీ రోడ్డు, 3వ వార్డులో 10.50లక్షలతో సీసీ రోడ్డు, 5వ వార్డులో రూ.15లక్షలతో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు, 13వ వార్డులో రూ.25 లక్షలతో పట్టణ పకృతివనం, ఓపెన్ జిమ్, 14వ వార్డులో రూ.60 లక్షలతో సీసీ రోడ్డు , 15వ వార్డులో 14లక్షలతో బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు, గ్రామాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీచైర్మన్ శరత్‌చంద్రారెడ్డి షాదీముభారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పోచారం చైర్మన్ కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల టీఆర్ఎస్ అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎన్.రమేశ్, నాయకులు ఎం.జంగయ్య యాదవ్, బొక్క ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ భాస్కర్‌రెడ్డి, ఆర్ఐ అలేఖ్య లబ్ధిదారులు పాల్గొన్నారు.