హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతూ దేశ ఖ్యాతిని దశదిశలా విస్తరిస్తున్న యువ ప్లేయర్లు నీరజ్‌చోప్రా, ప్రజ్ఞానందపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. సామాన్య మధ్య తరగతి కుటుంబాల నుంచి ఈ ఇద్దరు అంతర్జాతీయ స్థాయి ఎదగడంలో వారి తల్లుల పాత్ర వెలకట్టలేనిది. పసిప్రాయం నుంచే పిల్లల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ వారిని ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వెరవకుండా ఆ మాతృమూర్తులు చూపించిన పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇటీవలే జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించి కొత్త చరిత్ర లిఖించిన నీరజ్‌చోప్రా, చెస్ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
నీరజ్, ప్రజ్ఞాను ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దిన ఈ అమ్మలకు తాను అభిమాని అయ్యాయని మంత్రి ట్వీట్ చేశారు. ప్రపంచం గర్వించదగ్గ విజేతలను దేశానికి అందించిన తల్లులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీలో పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్‌పై నీరజ్ గెలువడంపై మీడియా భేటీలో ఒకరు అడిగిన ప్రశ్నకు నీరజ్ తల్లి సరోజ్దేవి స్పందించిన తీరు అందరినీ కట్టిపడేస్తున్నది. ‘ఎవరైనా పతకం గెలిచేందుకు మైదానంలో పోటీపడుతారు. ఎవరో ఒకరు కచ్చితంగా పతకం గెలువాల్సిందే. అది పాకిస్థానీయుడా లేక హర్యానా వాడా అనేది ప్రశ్న కాదు’ అని పేర్కొంది. దీనిపై సోషల్‌మీడియాలో పలువురు ఆమెను ప్రశంసిస్తూ సందేశాలు రాసుకొస్తున్నారు.