‘గత ప్రభుత్వాలు డబ్బా ఇండ్లు కట్టించినయి. అవి కూడా సబ్సిడీ, బ్యాంకు తిరకాసు పెట్టి ఇచ్చేటోళ్లు. ఎన్ని ఇబ్బందులు పడ్డరో మనకు తెలుసు. మా ప్రభుత్వం అన్ని సౌలత్‌లతో పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. బహిరంగ మార్కెట్లో అరకోటి విలువైన ఇంటిని ఉచితంగా కట్టించి ఇస్తున్నం. ఇచ్చిన ఇండ్లను అందరూ కలిసిమెలిసి శుభ్రంగా ఉంచుకోవాలి. రూ.9 వేలకోట్లతో నగరవ్యాప్తంగా ‘డబుల్’ ఇండ్లు నిర్మిస్తున్నాం. ఐమ్యాక్స్ టాకీస్ ఎదుట రూ.100 కోట్ల విలువైన స్థలంలో అన్ని సౌకర్యాలతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తాం. ఇక్కడెవరైనా ఫంక్షన్ చేసుకోవచ్చు’ అని పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఇందిరానగర్‌లో రూ.17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 ‘డబుల్’ఇండ్లను గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. మంత్రులు మహమూద్‌అలీ, తలసాని, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) /ఖైరతాబాద్ : దేశంలో ఏ మహానగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో పేదల కోసం రెండు పడకల గదుల (2బీహెచ్‌కే) ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా రూ.60 లక్షల విలువ చేసే ఇండ్లను పేదలకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ఖైరతాబాద్ ఇందిరానగర్ కాలనీలో రూ.17.85 కోట్ల వ్యయంతో చేపట్టిన 210 రెండు పడకల గదుల గృహాలను మంత్రి కేటీఆర్ గురువారం హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జిల్లా కలెక్టర్ శర్మన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
పేదల కోసం రూ.100కోట్ల విలువైన స్థలం
పేదల పక్షపాతి అని మరోసారి మంత్రి కేటీఆర్ చాటారు. పేద ప్రజల కోసం మోడ్రన్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కావాలని, ఇందుకు ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించాలన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ సభ వేదికపై తక్షణమే స్పందించారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని జీహెచ్ఎంసీకి అందజేయాలని, ఈ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్కుమార్ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాళ్లను మిగతా నియోజకవర్గాల్లో రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వ్యయంతో చేపడుతుండగా ఇకడ నిర్మించే ఫంక్షన్ హాల్‌కు రూ.10కోట్ల వరకు ఖర్చు చేస్తామన్నారు. స్థానిక కాలనీ వాసులకే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మిస్తామని చెప్పారు. రూ.100 కోట్ల విలువైన ఈ స్థలం పేద ప్రజల కంటే గొప్ప విషయం కాదన్నారు.
అయితే ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరగా.. సానుకూలంగా స్పందించి రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్న రామ్మూర్తి, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, హౌజింగ్ ఓఎస్డీ సురేశ్ కుమార్, ఆర్డీవో వసంతకుమారి, ఖైరతాబాద్, సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల కార్పొరేటర్లు పి.విజయా రెడ్డి, వనం సంగీత శ్రీనివాస్‌యాదవ్, మన్నె కవితారెడ్డి, ఎంఆర్వో అన్వర్, సర్కిల్ 17 డీఎంసీ వంశీకృష్ణ, జీహెచ్ఎంసీ హౌజింగ్ ఎస్ఈ కిషన్, హౌజింగ్ ఈఈ వెంకట్‌దాస్ రెడ్డి, డీఈలు సుధాకర్, సిద్ధార్ధ, గంగాధర్, ఏఈ మహేశ్, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, టీఆర్ఎస్ ఖైరతాబాద్, సోమాజిగూడ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, ఎస్కే అహ్మద్, మాజీ కార్పొరేటర్లు హేమలతా యాదవ్, లక్ష్మీనారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా..కొల్లూరు టౌన్షిప్ ప్రారంభం
హుస్సేన్‌సాగర్, నూతనంగా నిర్మించే 125 ఫీట్ల ఎత్తుగల అంబేదర్ విగ్రహం, సెక్రటేరియట్ పక్కనే ఉన్న ఇందిరానగర్ కాలనీలో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇదే గృహాలు ప్రైవేటు వారు నిర్మిస్తే ఒకొక ఫ్లాట్‌కు రూ.50లక్షల నుంచి రూ.60లక్షలకు పైగా అమ్మేవారని, అలాంటి ఇండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్నదని తెలిపారు. పేదల మోములో చిరునవ్వు, ఆత్మ గౌరవంతో బతకాలనేదే ముఖ్యమంత్రి ఆశయమని అన్నారు. ఆసియాలోనే అతి పెద్ద హౌసింగ్ కాలనీగా కొల్లూరులో 112బ్లాక్‌లలో 15,600 గృహాల నిర్మాణం పూర్తయిందని, త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు.
పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి శ్రీనివాస్ యాదవ్
రాష్ట్రంలోని పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం గృహాలు నిర్మించి ఉచితంగా ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందిరానగర్ కాలనీ వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా ఉపయోగపడే విధంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు చెప్పారు. నగర వాసులు శంషాబాద్, చంపాపేట్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ఎకడికి వెళ్లకుండా ఇకడ పేదలందరూ సంతోషంగా శుభకార్యాలు జరుపుకొనే వీలుకలుగుతుందన్నారు.
బీజేఆర్‌నగర్‌లో డబుల్ గృహాలు ఎమ్మెల్యే దానం నాగేందర్
ఖైరతాబాద్‌లోని బీజేఆర్‌నగర్‌లో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలం ఉందని, వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా అందిస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పేదలందరూ సంతోషంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని తెలిపారు. అదే స్ఫూర్తితో ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.