వెంగళరావునగర్, మార్చి 7: సమాజంలో మహిళా శక్తి అసమానమైనదని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మహిళలు తల్చుకొంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న మహిళాబంధు కార్యక్రమంలో భాగంగా విద్యుత్తు శాఖలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 217 మంది లైన్ ఉమెన్లను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ఘనంగా సన్మానించారు.
సోమవారం వెంగళరావునగర్ డివిజన్ జీటీఎస్ కాలనీలోని జెన్కో, ట్రాన్స్‌కో ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్తు శాఖలో ఒకేసారి 217 మంది జూనియర్ లైన్ ఉమెన్లను నియమించటం ఇదే మొదటిసారి అన్నారు. లైన్ ఉమెన్ అనే పదాన్ని మార్చి మహిళా శక్తిని ప్రతిబింబించే పేరు పెట్టాలని విద్యుత్తు శాఖకు సూచించారు. లింగ వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ట్రాన్స్ కో, జెన్కోలో 9,644 ఉద్యోగాలు భర్తీచేస్తే, అందులో 50% మహిళలే ఉండటం తెలంగాణ మహిళా శక్తిని చాటుతున్నదన్నారు.
బాలికా విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ కేసీఆర్ తెచ్చిన సంస్కరణలతో రాష్ట్ర విద్యారంగంలో గొప్ప మార్పు వచ్చిందని తెలిపారు. నాణ్యమైన విద్య లభిస్తే ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకురాగలమన్నారు. కేసీఆర్ కిట్‌తో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని, ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు 56 శాతానికి పెరిగాయని చెప్పారు. ఉపాధి రంగాల్లో మహిళలు పురుషులకు గట్టి పోటీ ఇస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని, ప్రభుత్వ పథకాల్లో ఎక్కువమంది లబ్ధిదారులు మహిళలేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్సీడీసీఎల్ సీఎండీ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.