Tamil Actor Arya | ప్రముఖ తమిళ నటుడు ఆర్యతో పాటు ఆయన నటిస్తున్న ‘అనంతన్ కాడు’ చిత్ర బృందంపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా చిత్రీకరణ నిమిత్తం అద్దెకు తీసుకున్న అత్యాధునిక డిజిటల్ కెమెరాలు, లైటింగ్ పరికరాలకు సంబంధించిన రూ.1.80 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా మోసగించారని జూబ్లీహిల్స్ వెంకటగిరి పరిధిలోని ‘తాహెర్ సినీ టెక్నిక్’ సంస్థ పోలీసులను ఆశ్రయించింది.
బాధితుల కథనం ప్రకారం.. ‘అనంతన్ కాడు’ చిత్ర షూటింగ్ కోసం గతేడాది ఫిబ్రవరిలో నటుడు ఆర్య, నిర్మాత వినోద్ తమ సంస్థను సంప్రదించి అత్యంత ఖరీదైన కెమెరాలు, లైటింగ్ యూనిట్లను అద్దెకు తీసుకున్నారు. మొత్తం రూ.2.12 కోట్ల అద్దెకు గానూ.. షూటింగ్ పూర్తయిన తర్వాత మెజారిటీ వాటా అయిన రూ.1.80 కోట్లకు పైగా బకాయిలను చిత్రబృందం చెల్లించలేదు. సినిమా విడుదలకు ముందే మొత్తం బకాయిలు చెల్లించి ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తీసుకుంటామని లిఖితపూర్వకంగా అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాలకు స్పందించకుండా ఎగవేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
అంతేకాకుండా, బకాయిల విషయమై సంప్రదించిన తమ సంస్థ మేనేజర్‌ను నటుడు ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరింపులకు గురిచేశారని సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చి కేరళలోని న్యాయస్థానం నుండి వీరు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.