Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, షోకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెయిన్ హౌస్‌లోకి కామన్ కంటెస్టెంట్ల ఎంపిక కోసం నిర్వహించే స్పిన్-ఆఫ్ షో ‘అగ్నిపరీక్ష’ రెండో సీజన్ ఈసారి మరింత గ్రాండ్‌గా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ ఆగస్టు 15 నుంచి ఓటీటీ వేదికపై ప్రసారం కానుందట. అయితే దీనిపై స్టార్ మా లేదా షో నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
లీకుల ప్రకారం, గత సీజన్లో 15 ఎపిసోడ్లతో ముగిసిన ఈ ప్రీ-షోను ఈసారి మొత్తం 22 ఎపిసోడ్లుగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి తొమ్మిది ఎపిసోడ్లలో వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి టాప్ కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారని సమాచారం. అనంతరం మిగిలిన ఎపిసోడ్లలో వారిని వివిధ టాస్క్‌లు, సవాళ్ల ద్వారా పరీక్షించి మెయిన్ హౌస్‌కు అర్హులైన వారిని ఎంపిక చేస్తారని టాక్ వినిపిస్తోంది. గత ఏడాది నిర్వహించిన తొలి సీజన్లో డిజిటల్ ఆడిషన్ తరహాలో కార్యక్రమం సాగింది. ఆ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించగా, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా కనిపించారు. ఈసారి మాత్రం ఫార్మాట్లో పలు మార్పులు చేసి మరింత ఉత్కంఠభరితంగా రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు ‘దశావతారం’ థీమ్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ థీమ్‌కు అనుగుణంగా కంటెస్టెంట్ల శారీరక, మానసిక సామర్థ్యాలను పరీక్షించేలా ప్రత్యేక టాస్క్‌లు రూపొందించినట్లు చెబుతున్నారు. అలాగే ‘అగ్నిపరీక్ష’లో పాల్గొనే కంటెస్టెంట్ల భవితవ్యాన్ని ప్రేక్షకుల ఓటింగ్‌తో పాటు జ్యూరీ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. మెయిన్ షో ప్రారంభానికి ముందే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచడమే ఈ స్పిన్-ఆఫ్ షో ప్రధాన ఉద్దేశమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ వివరాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మాత్రమే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10, ‘అగ్నిపరీక్ష 2’కు సంబంధించిన అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.