
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను పకడ్బందీగా సేకరించేందుకు జీహెచ్ఎంసీ అదనంగా మరో 1350 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 3.3 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ ఒక్కో ఆటో ద్వారా ప్రతిరోజూ 450 నుంచి 500 ఇండ్ల నుంచి 1.50 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 4500, మరో 750 ప్రైవేట్ ఆటోలు కలిపి మొత్తం 5250 వాహనాల ద్వారా నిత్యం మహానగరంలో ఉత్పత్తి అవుతున్న 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్‌కు తరలిస్తున్నారు. కాగా నగరంలో ప్రవేశపెట్టిన నూతన స్వచ్ఛ ఆటోలను మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి సోమవారం ప్రారంభించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు… పారిశుధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు గణనీయంగా మెరుగుపర్చుకుంటూ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో జనాభాకు అనుగుణంగా ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ సామర్థ్యాన్ని పెంచుతున్నది. 2015లో రోజుకు 2,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ సామర్థ్యం ఉంటే.. ఇప్పుడు 6,500 మెట్రిక్ టన్నులకు సామర్థ్యం పెరుగడం విశేషం. ఈ క్రమంలో చెత్తను మరింత పకడ్బందీగా సేకరించేందుకు జీహెచ్ఎంసీ అదనంగా మరో 1350 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకురాగా, సోమవారం మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ లబ్ధిదారులకు ఆటోలను పంపిణీ చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ తరఫున 4500 వాహనాలు, 750 ప్రైవేట్ వాహనాలు కలిపి 5250 వాహనాల ద్వారా నిత్యం 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్‌కు తరలిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 3150 స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఉన్నాయి. ఓనర్ కం డ్రైవర్ పథకం ద్వారా 5 వేల మందికి జీవనోపాధి కల్పించారు. ఒక ఆటోకు డ్రైవర్‌తో పాటు హెల్పర్ ఉంటారు. వీరంతా సకాలంలో ఇంటి ముందరకు వెళ్లి ఆటో ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. ఈ స్వచ్ఛ టిప్పర్లను 30 సర్కిళ్లకు కేటాయించారు. ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన కాలనీలలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ మరింత మెరుగ్గా ఉండేందుకుగానూ నూతనంగా 1350 ఆటోలను ప్రవేశపెట్టారు. 3.3 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ ఒక్కో ఆటో ద్వారా 450-500 ఇండ్ల నుంచి తడి, పొడి చెత్త రూపంలో రోజుకు 1.50 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉన్నాయి. నగరంలో ప్రతిరోజు 6500 మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని 3150 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి సేకరించడం, కమర్షియల్ ప్రాంతాల ప్రధాన రహదారులలో వచ్చే చెత్తను ముందుగా ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు పంపిస్తారు. కోర్టు ఆదేశాలను అనుసరించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమ నిబంధనల ప్రకారం ఈ 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఆధునీకరణ చేపట్టి నూతన సంవత్సరం నుంచి నిర్వహించనున్నారు.
ఈ 1350 స్వచ్ఛ ఆటోలను లబ్ధిదారులకు పది శాతం కంట్రిబ్యూషన్ ప్రాతిపదికన పంపిణీ చేశారు. ఒక్కో ఆటో ఖరీదు రూ.7.25,805లు ఉండగా ఓనర్ కం డ్రైవర్ స్కీంలో భాగంగా 10 శాతం ఖర్చు వెహికల్ తీసుకునే వ్యక్తి నుంచి తీసుకోగా, మిగతా 90 శాతం వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఇందుకు ఆర్థిక రుణాన్ని కెనరా బ్యాంక్ నుంచి 8శాతం వడ్డీతో 72 నెలల పాటు జీహెచ్ఎంసీ చెల్లించనుంది. ఈ ఆటోలను ఆటోమోటివ్ మ్యాన్ఫ్రాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా సమకూర్చింది.