
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు సృష్టిస్తున్నదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుంటే, అక్కడకు వెళ్లి బీజేపీ నాయకులు ఘర్షణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుడు మాటలతో రైతులను రెచ్చగొట్టడం మానుకోవాలని, నల్లగొండ జిల్లా ఘటన పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పండే పంటనంతా కొంటామని కేంద్రంతో ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. గతంలో దండుగ అన్న వ్యవసాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగ చేసిందని, వ్యవసాయరంగం 16 శాతం వృద్ధి సాధించిందని వివరించారు. దీనావస్థలో ఉన్న రైతుల ముఖంలో స్వరాష్ట్రంలో సంతోషాన్ని చూస్తున్నామని అన్నారు.