హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తున్న హైదరాబాద్.. కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వైపు విద్యార్థులను ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అరణ్యభవన్‌లో మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి (టీఎస్ కాస్ట్) కార్యనిర్వహక సమావేశం జరిగింది. విద్యార్థుల్లో సైన్స్ టెక్నాలజీ పట్ల అవగాహన, వృత్తినైపుణ్య శిక్షణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనను మెరుగుపర్చేందుకు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలితో సమన్వయం చేసుకుంటూ టీఎస్ కాస్ట్ పనిచేయాల్సిన అవసరమున్నదని చెప్పారు. ప్రస్తుతం విద్యాసంస్థల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆశించిన ఆవిష్కరణలు జరగటం లేదని, ఆ లోపాలను సవరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, పర్యావరణం, సహజ వనరుల నిర్వహణలో పరిశోధనలు చేసే విద్యార్థులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పర్యావరణ, శాస్త్ర, సాంకేతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ కాస్ట్ మెంబర్, సెక్రటరీ ఎం నగేశ్, కేంద్రప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ శాస్త్రవేత్త రష్మి, ఉత్తరప్రదేశ్ శాస్త్ర సాంకేతిక శాఖ జాయింట్ డైరెక్టర్ రాజేశ్ గంగ్వార్ తదితరులు పాల్గొన్నారు.