హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అవతరించిన అనతి కాలంలోనే దేశంలోకెల్లా తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్ఠమైన ఆర్థిక విధానాలతో అనేక ప్రతికూలతలు, పరిమితుల మధ్య తెలంగాణ బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని చెప్పడంలో అతిశయోక్తిలేదన్నారు.తెలంగాణ అగ్రగామిగా నిలిచిన పలు అంశాలను మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు.
75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం.
ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ప్రీమియం భారం లేకుండా రూ.5లక్షల బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 10 లక్షల మంది ఆడపిల్లలకు పెండ్లిళ్లు జరిపించిన ఏకైక రాష్ట్రం
10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్లనుఅందించిన ఒకే ఒక రాష్ట్రం
8 ఏండ్లలో రూ.46,650 కోట్లను ఆసరా ఫించన్ల రూపంలో పేదలకు అందించిన ఏకైక రాష్ట్రం
ఇంటింటికి నల్లాలు పెట్టి స్వచ్చమైన తాగునీరు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం
అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం
తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోనే నంబర్ 1 గా నిలిచిన రాష్ట్రం
అత్యధిక షీప్ పాపులేషన్ కలిగిన ఒకే ఒక్క రాష్ట్రం
ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ,ట్యాంకర్, డంపుయార్డు, వైకుంఠధామం ఏర్పాటు చేసిన ఒకే రాష్ట్రం.
46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసిన ఒకే ఒక్క రాష్ట్రం
ప్రభుత్వ దవాఖానల్లో అత్యధిక ప్రసవాలను చేస్తున్న రాష్ట్రం, మాతాశిశు మరణాల సంఖ్య కనీసస్థాయికి తగ్గించిన రాష్ట్రం
వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాతీయ సగటుకంటే ముందున్న రాష్ట్రం
హరితనిధిని ఏర్పాటుచేసిన మొట్టమొదటి రాష్ట్రం
చెత్తనుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న తొలి దక్షిణ భారత నగరం హైదరాబాద్. ఓడీఎఫ్ ప్లస్, వాటర్ ప్లస్ నగరంగా గుర్తింపు
సుపరిపాలన సూచీలో పరిశ్రమలు, వాణిజ్యరంగంలో నంబర్ వన్ రాష్ట్రం

దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ
తెలంగాణ ప్రభుత్వ కృషితో వ్యవసాయరంగం కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రగతిని సాధించిందని మంత్రి అన్నారు. ఊహకందని రీతిలో వ్యవసాయోత్పత్తి పెరిగిందని తెలిపారు. మిషన్ భగీరథను ప్రేరణగా తీసుకొని కేంద్రం హర్ ఘర్ జల్ పథకాన్ని దేశమంతటా అమలు చేస్తున్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటితో పోలిస్తే రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7 శాతం మేరకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిన పథకమని మంత్రి తెలిపారు. నేడు భారతదేశంలో అత్యధిక స్థాయి వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ వారేనని చెప్పారు. భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా ఏర్పడుతున్న ప్రతి పది ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలను తెలంగాణ ఐటీరంగమే కల్పిస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
దేశ జీడీపీ వృద్ధిలో కీలకం
2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7% ఆర్థికవృద్ధిని సాధించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15 లో 4.06%గా ఉంటే 2021-22 నాటికి 4.97 శాతానికి పెరిగిందని తెలిపారు. ఏడేండ్లలో దేశ జీడీపీకి ఒక శాతం అదనపు వాటా అందించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తలసరి ఆదాయవృద్ధి రేటులో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు.