Minister Gangual Kamalakar | మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ ప్రత్యేక చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళ్యాణి గార్డెన్స్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, టీకాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలు హజ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారని.. అలాంటి యాత్రకు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేని వారు కూడా యాత్రకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అల్లాను ప్రార్థించాలన్నారు. అల్లా దయతో దేశంలోని దెయ్యాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
సర్వమతాల వేదిక తెలంగాణ అని మంత్రి వ్యాఖ్యానించారు. అన్ని మతాల పండుగలను, వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రాధాన్యతను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి కొనసాగుతుందని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. హజ్ యాత్రికులకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని.. ఏ సమస్య వచ్చినా 24/7 తమను సంప్రదించవచ్చని సూచించారు. అవసరమైతే సౌదీ అరేబియా ప్రభుత్వంతో మాట్లాడి కూడా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.