క్రీడా నేపథ్య చిత్రాలన్నీ జీరో నుంచి హీరోగా ఎదగడాన్నే చూపిస్తాయని,‘గని’చిత్రంలో తామూ అదే ఫార్ములాను కమర్షియల్‌గా చూపించామని చెబుతున్నారు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. వరుణ్ తేజ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్రంలో బాలీవుడ్ తార సయీ మంజ్రేకర్ నాయిక కాగా అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ, రెనైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ…‘కరోనా వల్ల సినిమా మేకింగ్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయి. అవన్నీ ఇంకో షార్ట్ ఫిలిం తీసుకోవచ్చు. వరుణ్ తేజ్ నేను కలిసి పనిచేశాం. ఆయనకు నాతో సినిమా చేయాలని ఉండేది. ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు స్పోర్ట్స్ మూవీ అయితే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాం. అందులో బాక్సింగ్ అంటే కమర్షియల్‌గా ప్రేక్షకులకు ఇంకాస్త కనెక్ట్ అవొచ్చు అనిపించింది. పేరొచ్చిన ఏ క్రీడాకారుడైనా కిందస్థాయి నుంచి ఎదిగినవాడే. గని జీవితం కూడా అలాగే ఉంటుంది. గని సినిమా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపుతుంది. వాస్తవంగా కొందరు బాక్సర్ల జీవితాల నుంచి ఇన్ స్పైర్ అయి రాసుకున్న కథ ఇది. వాళ్లు బాక్సింగ్‌లో ఎదిగేందుకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. సమాజం నుంచి అటు క్రీడా రాజకీయాల నుంచి వాళ్లకు ఎదురైన అడ్డంకులు ఏంటి అనేది స్ఫూర్తిగా తీసుకుని కథలో చూపిస్తున్నాం. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఇందులో ప్రేమ కథను కలపడం సవాలుగా మారింది. వరుణ్ గత చిత్రాలు ఫిదా, తొలిప్రేమ ఇమేజ్ వల్ల లవ్ ట్రాక్ పెట్టాల్సివచ్చింది. సినిమా విడుదలకు కొవిడ్ వల్ల ఇబ్బందులు వచ్చాయి. అనేకసార్లు వాయిదాలు వేసి వేసి, చివరకు ఓటీటీలో విడుదల చేయండని నేను నిర్మాతలకు సూచించాను. కానీ వాళ్లు ఈ సినిమాను థియేటర్లోనే చూడాలని నిర్ణయించుకున్నారు. సినిమాలో 20 నిమిషాల టోర్నమెంట్ సీన్ ఆకర్షణగా నిలుస్తుంది. వరుణ్ గని పాత్రలా మారిపోయారు. నటన పట్ల ఆయన అంకితభావం నన్ను బాగా ఆకట్టుకుంది’ అన్నారు.