Assam Rifles : అరుణాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. భద్రతా దళాల్లో కీలక విభాగమైన అసోం రైఫిల్స్ బృదాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్, చంగ్లాంగ్ జిల్లాలో ఇండియా-మయన్మార్ సరిహద్దులో మంగళవారం జరిగింది.
ఉదయం 6.30 గంటల సమయంలో 21 అసోం రైఫిల్స్ బృందానికి చెందిన జవాన్లు నాంపోంగ్ నల్లా ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇది ఇండియా-మయన్మార్ సరిహద్దు కావడంతో ఇక్కడ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తనిఖీ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఉన్నట్లుండి అసోం సైనిక దళాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హవిల్దార్ జంఖోకాయ్ కుకి (42) అనే జవాన్ మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో భారీ స్తాయిలో మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఎన్ఎస్సీఎన్ (కే-వైఏ) అనే ఉగ్రవాద సంస్థ ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు.