బోయినపల్లి రూరల్, జూన్ 21: బీఆర్ఎస్ హయాంలో గోదావరి జలాలతో కళకళలాడిన శ్రీరాజరాజేశ్వర జలాశయం.. నేడు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో ఎడారిలా మారిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతాంగానికి సాగునీరు అందిస్తే.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని ధ్వజమెత్తారు.
చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేర్) జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపాలని కోరారు. అనంతరం నాయకులతో కలిసి మానేరులో కబడ్డీ, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు.