లండన్, ఏప్రిల్ 7: ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్. తాగే నీళ్లు పట్టడానికి ప్లాస్టిక్. తినే అన్నం కట్టడానికి ప్లాస్టిక్. పల్లె.. పట్నం, కొండ.. కోన, గాలి.. నేల అన్న తేడా లేకుండా ఆర్కిటిక్ నుంచి అంటార్కిటిక్ దాకా, భూమండలాన్ని చుట్టేసిన ప్లాస్టిక్ పెనుభూతం ఇప్పుడు మనిషి ఊపిరితిత్తుల్లోకీ చేరింది. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు ఊపిరితిత్తుల్లో మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. గాలితో పాటు ప్లాస్టిక్ రేణువులు కూడా మనకు తెలియకుండా ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయని పేర్కొన్నారు. ఇవి మానవ శ్వాస వ్యవస్థ పైనే కాకుండా శరీర ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలు కలుగజేస్తాయని హెచ్చరించారు.
ఇంగ్లండ్‌లోని హల్ యార్క్ మెడికల్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనల్లో భాగంగా 13 మంది ఊపిరితిత్తుల్లోని కణజాలాలను పరీక్షించింది. ఇందులో 11 మందిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టు తేలింది. శాస్త్రవేత్తలు మొత్తం 39 మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. ఆహార పదార్థాల ప్యాకేజింగ్, వాటర్ బాటిళ్ల తయారీలో వాడే ప్లాస్టిక్ అణువులే వీటిలో ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. నెదర్లాండ్స్ పరిశోధకులు కూడా రక్తంలో మైక్రోప్లాస్టిక్స్‌ను ఇటీవలే గుర్తించారు. 22 మంది నమూనాలపై పరీక్షలు నిర్వహించగా 17 మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. ఇవి రక్తంలో నరాల వెంబడి పేరుకుపోయి ప్రాణాంతకాలు కావొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ భూతం పర్యావరణానికే కాక మానవ జీవనానికి ఎంతటి ప్రమాదకారో ఈ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ రేణువులను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. గాలి, సముద్రాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సముద్రాల్లో ఉండే మైక్రోప్లాస్టిక్స్ జలచరాలకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నట్టు చాలా అధ్యయనాల్లో తేలింది. చేపల్లోని పలు అవయవాల్లో మైక్రోప్లాస్టిక్స్‌ను ఇప్పటికే గుర్తించారు.