న్యూఢిల్లీ, ఆగస్టు 13: చిన్నాపెద్ద, ప్యాక్డ్, అన్ప్యాక్డ్ అన్న తేడాలేకుండా ఇండియాలో దొరికే అన్ని ఉప్పు, చక్కెర బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మంగళవారం టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ హిత సంస్థ విడుదల చేసిన ‘మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్’ నివేదికలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్, రా సాల్ట్‌తో పాటు ఐదు రకాల చక్కెరలను పరిశీలించగా.. అన్ని శాంపిళ్లలో 0.1 ఎంఎం నుంచి 5 ఎంఎం పరిమాణం కలిగిన మట్టిబెడ్డలు, ఫైబర్, ఫిల్మ్స్ బయటపడ్డాయని నివేదిక వెల్లడించింది.
అత్యధికంగా అయోడైజ్డ్ ఉప్పులో పలు రకాల ఫైబర్, ఫిల్మ్ మైక్రోప్లాస్టిక్స్ కనిపించాయని తెలిపింది. ఒక కిలో ఉప్పులో 6.71 నుంచి 89.15 మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఉంటున్నాయని వివరించింది. ఆర్గానిక్ ఉప్పులో అత్యల్పంగా 6.70 మైక్రోప్లాస్టిక్ ముక్కలు, అత్యధికంగా అయోడైజ్డ్ ఉప్పులో 89.15 మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్టు పేర్కొన్నది.