Microplastic | న్యూఢిల్లీ : మైక్రోప్లాస్టిక్‌లు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తున్నాయని, 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదముందని చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
నాన్జింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, కాలుష్యం వల్ల మక్కలు, వరి, గోధుమ తదితర పంటలు ఉనికిలో లేకుండా పోతున్నాయని, ప్రధాన పంటల్లో 4 నుంచి 14 శాతం వరకు నష్టపోతున్నాయని పరిశోధకులు అంచనా వేశారు. 2058 నాటికి ప్రపంచ జనాభా 1,000 కోట్లకు చేరుకోనున్న నేపథ్యంలో సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయటం సవాల్‌గా మారుతుందని హెచ్చరించారు. దీంతో ప్రపంచ ఆహార భద్రతకు తీవ్ర ముప్పు పొంచి వుందని, కాలుష్య కారణంగా ఆహార సరఫరా గణనీయంగా తగ్గుతుందని వారు తెలిపారు. ఇప్పటికే (2022నాటికి) ఆకలి సంక్షోభం పెరగటంతో 70 కోట్ల మందిపై దాని ప్రభావం పడిందని, మైక్రోప్లాస్టిక్స్ కాలుష్యం ఇదే విధంగా సాగితే తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అధ్యయనం పేర్కొన్నది.