రామగిరి, ఏప్రిల్ 18: మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ, బీపీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ కళాశాల లు విద్యా ప్రమాణాలు పాటించాలని వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (Altaf Hussain) సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యామండలి, ప్రభుత్వ ఆదేశాలతో అన్ని కళాశాలల్లో మే 15లోగా విద్యార్థులు, అధ్యాపకుల హాజరుకై ఎస్ఆర్ఎస్(ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ మిషన్స్) అందుబాటులోకి తేవాలని, ఎవ్వరికి మినహాయింపులేదని ఆయన స్పష్టం చేశారు.
వర్సిటీలోని సమావేశ మందిరంలో గురువారం ఉమ్మడి జిల్లాలోని ఆయా కళాశాలలలోని ప్రిన్సిపల్స్‌తో వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సమావేశమయ్యారు. తొలుత కళాశాల వారీగా విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల వివరాలపై సమీక్షించి అండర్ టేకింగ్స్(హామీ పత్రలు) స్వీకరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్య అంటేనే విద్యావ్యవస్థలో తల్లిలాంటిదని, నాణ్యమైన విద్య అందిస్తేనే సమాజానికి ఉత్తమ ఉపాధ్యాయులను అందించగలమని తెలిపారు. కళాశాలల్లో పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేని వాటిలో అధ్యాపకుల నియమకం చేయాలని, విద్యార్థుల హాజరు మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రాక్టికల్స్, రికార్డుల నిర్వహణపై దృష్టి పెట్టాలని వీసీ ఆదేశించారు.
సమావేశ అనంతరం పలు కళాశాల ప్రిన్సిపాల్స్ వీసీని కలిసి బీఈడీ నాలుగో సెమిస్టర్ కరిక్యూలమ్‌లో సూచించిన విధంగానే మూక్స్ ఆన్లైన్ కోర్స్ విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ సమస్య ఉందని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. విద్యార్థులంతా ఖచ్చితంగా మూక్స్ కోర్సు పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించాలని వీసీ తేల్చి చెప్పారు. కోర్సు పూర్తి చేయని వారికి ఎట్టి పరిస్థితుల్లో బీఈడీ సర్టిపిటిక్ ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.వై.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ॥, కొప్పుల అంజిరెడ్డి, అసిస్టెంట్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. ఎం. జయంతి, కోఆర్డినేటర్ సమరీన్ ఖజ్మీ, సీనియర్ ప్రిన్సిపాల్స్ డా. గంగాధర్ రావు, డా. నింరజన్ రెడ్డి, డా. వేణు, డా.జబ్బార్, డా. రజినీతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.