‘వియ్ ట్రీట్. హీ క్యూర్స్’ మేం చికిత్స చేస్తాం. దేవుడు స్వస్థత ప్రసాదిస్తాడు. అంటుంటారు వైద్యులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో. ప్రతి మనిషిలో పరమాత్మ ఉంటాడని చెబుతుంది భారతీయ ధర్మం. ఆ దివ్యశక్తికి మరోపేరు ఆత్మబలమూ కావచ్చు. వైద్యుడి చికిత్సకు రోగి ఆత్మశక్తి తోడైతే అద్భుతాలు సాధ్యమనడానికి ఎన్నో ఉదాహరణలు.
కోలుకోవాలనే ఆశ, కోలుకుంటామనే ధైర్యం, బతుకు పట్ల మమకారం రోగికి చాలా అవసరం. అప్పుడే వైద్యం మెరుగ్గా పనిచేస్తుంది. ఔషధాలూ సమర్థంగా ప్రభావం చూపుతాయి. మనోబలం మద్దతుతో వెంటిలేటర్ మీది నుంచి బయటికొచ్చిన రోగులూ ఎంతోమంది. హైదరాబాద్‌కు చెందిన 36 ఏండ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు కొవిడ్ సోకింది. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చొరబడింది. న్యుమోనియాతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. సరిగ్గా 90 రోజులు ఎక్మో సపోర్ట్‌పైనే ఉన్నాడు. ఈ పరిస్థితిలోనూ మనోధైర్యం తగ్గలేదు. మొత్తానికి, సురక్షితంగా ఇల్లు చేరాడు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ కేస్‌ను ఇప్పటికీ ఆ కార్పొరేట్ దవాఖాన డాక్టర్లు ‘మిరాకల్ రికవరీ’గా పేర్కొంటారు.
ఓ హాస్పిటల్లో పని చేసే 25 ఏండ్ల నర్సు తొలి దశ కరోనా మొదలైనప్పటి నుంచీ కొవిడ్ వార్డులోనే పని చేసింది. ఓ దశలో ఆమెకూ కొవిడ్ సోకింది. తీవ్ర లక్షణాలతో చాలా ఇబ్బంది పడింది. రెండు నెలలు వెంటిలేటర్‌పై ఉంది. అయినా ధైర్యాన్ని కోల్పోకుండా, వ్యాధితో మొండిగా పోరాడి కోలుకున్నది. నర్సులు, డాక్టర్లు తనకు అందించిన ధైర్యం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నదామె.
నిపుణుల మాట..
“మిగిలినవారితో పోలిస్తే, యువతీ యువకుల్లో మేం మంచి ఫలితాలను చూస్తున్నాం. అదే సమయంలో, 76 ఏండ్ల రోగుల్లోనూ మిరాకల్ రికవరీలు కనిపిస్తున్నాయి. కాకపోతే, యువతలో కండరాల సామర్థ్యం ఎక్కువగా ఉండటం, వెంటిలేటర్ లేదా ఎక్మో సపోర్ట్ ఇచ్చినప్పుడు అవయవాలు త్వరగా స్పందించడంవల్ల చాలా కేసుల్లో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. రోగి వేగంగా కోలుకోవడంలో మనోధైర్యం చాలా ఉపయోగపడుతుంది. వెంటిలేటర్ తీసేశాక సహజంగానే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
వీటన్నిటినీ భరిస్తూ త్వరగా ఇంటికి చేరాలనుకొంటే మానసిక దృఢత్వం అవసరం’ అంటారు డాక్టర్ వెంకట్రామన్. చాలామంది పేషెంట్లు ఐసీయూలోకి లేదా వెంటిలేటర్ మీదకు వెళ్లగానే భయపడిపోతారు. తీవ్ర ఆందోళనకు గురై ఒత్తిడిని పెంచుకుంటారు. అలాంటి కేసుల్లో రికవరీ నెమ్మదిగా ఉంటున్నదని అధ్యయనాల్లో తేలింది. తీవ్ర ఆందోళనకు గురైనప్పుడు మనిషిలోని రోగనిరోధక శక్తి తగ్గిపోవడం కూడా ఇందుకో కారణమే. ‘మనోధైర్యం అనేది కొవిడ్ నుంచే కాదు, అన్ని రుగ్మతల నుంచీ త్వరగా కోలుకోవడానికి తోడ్పడుతుంది’ అని వివరిస్తారు డాక్టర్ శ్వేతారామ్.