పహాడీషరీఫ్, జనవరి 30 : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈనెల 2న జల్పల్లి యువకులు, విద్యార్థులు కలిసి జల్పల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన విషయం విదితమే. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సూపర్‌కింగ్ టీమ్, టైగర్ టీమ్‌తో తలపడగా సూపర్‌కింగ్ టీమ్ విజయం సాధించింది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జల్పల్లికి విచ్చేసి వారికి ట్రోఫీని అందజేశారు. అనంతరం క్రికెట్ టీమ్‌కు సహకరించిన వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. కార్యక్రమంలో జేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు సూరెడ్డి వినయ్‌రెడ్డి, వినయ్‌గౌడ్, దేవేందర్, లడ్డు, శివ, విశ్వనాథ్‌గౌడ్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట..
కందుకూరు: రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని గూడూరు సర్పంచ్ భర్త శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు, డైరెక్టరు నర్సింహ, అగర్మియగూడ ఉప సర్పంచ్ ఆదీబ్, బాచుపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బాలమల్లేశ్, తుక్కుగూడ మున్సిపాలిటీ వైఎస్ చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి మంత్రిని ఆదివారం కలిసి గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాలు అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామాలకు ప్రతి నెల పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.