‘ఏమిటో ఈమధ్య అన్నీ మర్చిపోతున్నా…’ యాభై దాటిన మహిళల్లో ఎక్కువమంది నుంచి వచ్చే మాట ఇది. మెనోపాజ్ అని సరిపెట్టుకుంటారే తప్ప చాలామంది దీన్నో సమస్యగానే గుర్తించరు. ఎందుకంటే మెనోపాజ్ దశలోనూ, ఆ తరవాత కూడా వేడి ఆవిర్లు, కుంగుబాటు, అలసట, ఆందోళన, మతిమరుపు, నిద్రపట్టకపోవడం… వంటి ఎన్నో సమస్యలు మహిళల్ని ఇబ్బందిపెడుతుంటాయి.
హార్మోన్లలో మార్పులవల్ల ఇదంతా సహజమే అనుకుంటాం. అయితే అక్కడితోనే ఆగదు. దీని కారణంగా మెదడు నిర్మాణంలోనూ మార్పులొస్తున్నాయి అంటున్నారు నిపుణులు. మెనోపాజ్ వల్ల మెదడులోని అనేక ప్రాంతాల్లో గ్రే మ్యాటర్ తగ్గినట్లు పలువురు పరిశోధకులు గుర్తించారు. కొందరిలో మానసిక కుంగుబాటు, మతిమరుపు, నిద్రలేమి వంటివి ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఇదే అంటున్నారు. అయితే మెనోపాజ్ లక్షణాల్ని తగ్గించుకునేందుకు కొందరు హార్మోన్ల థెరపీనీ ఆశ్రయిస్తుంటారు.
అలా తీసుకున్నవాళ్ల మెదడు నిర్మాణంలో పెద్దగా మార్పు కనిపించలేదు. కానీ లక్షణాలు మరింత తీవ్రతరం కాలేదని పరిశోధనలో వెల్లడైంది. అంటే, మెదడు ఆరోగ్యంలో వచ్చే కీలకమైన ఈ మార్పు కారణంగానే వృద్ధాప్యంలో మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా డిమెన్షియా, ఆల్జిమర్స్ బారిన పడుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే ముందునుంచీ ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామాలతో కొంతవరకూ ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. అలాగే మహిళల్లో వచ్చే ఈ మార్పుల్ని గమనించి కుటుంబసభ్యులూ వాళ్లకు అండగా ఉంటే సమస్య తీవ్రతని తగ్గించవచ్చని చెబుతున్నారు!