హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): మేఘా ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఈడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ స్కీం, మూసీ పునరుజ్జీవం కింద చేపట్టే మల్లన్నసాగర్ ఎత్తిపోతల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, వేల కోట్ల రూపాయలను దండుకుంటున్నారని, ప్రభుత్వ పెద్దల కుటుంబాల కంపెనీలే ఈ అక్రమాల్లో కీలకమని ఆరోపించారు. రూ.4,350 కోట్లతో చేపడుతున్న కొడంగల్-నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ఎంఈఐఎల్ (మేఘా సంస్థ)కు ఇచ్చారని, మూసీ పునరుజ్జీవం కింద రూ.5,560 కోట్లతో మల్లన్నసాగర్ నుంచి మూసీ నదికి నీటిని ఎత్తిపోసే పథకాన్ని రాఘవ కన్స్ట్రక్షన్కు ఇచ్చారని, వీటి ద్వారా భారీగా అక్రమలు జరుగుతున్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పొంగులేటి ద్వారా భారీ కుంభకోణం
ప్రభుత్వంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాష్ట్రవ కన్స్ట్రక్షన్కు నీటిపారుదల కాంట్రాక్టులను ఇవ్వడంలో భారీ కుంభకోణం జరుగుతుందని బక్క జడ్సన్ ఆరోపించారు. ఈ పథకం ద్వారా భారీగా డబ్బులు పొందేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి బంధువర్గంలో అనుమానాస్పదంగా ఉన్న కంపెనీలకు నీటిపారుదల టెండర్లను గుట్టుగా ఇస్తున్నారని ఈడీ దృష్టికి తీసుకెళ్లారు.
పొంగులేటి బంధుప్రీతి
మూసీ నది పునరుద్ధరణ కోసం మల్లన్న సాగర్ నుంచి మూసీ నదికి నీటిని ఎత్తిపోసే టెండర్‌ను మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు అప్పగించారని జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది అత్యున్నత స్థాయి బంధుప్రీతి తప్ప మరొకటి కాదని, పారదర్శక పద్ధతిలో టెండర్లను కేటాయించనందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ సీం కోసం మరో టెండర్‌ను మేఘా ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్‌కి అప్పగించారని చెప్పారు. ఆగస్టులో సుంకిశాల ప్రాజెక్ట్ గోడ కూలిపోవడంపై శాఖాపరమైన విచారణలో ఎంఈఐఎల్ నేరపూరిత నిర్లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించారని, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలని డిమాండ్ చేశారు.