
ఖైరతాబాద్, నవంబర్ 11 : స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాలు విడుదలైన నేపథ్యంలో శనివారం ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల విధి విధానాలపై సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో కార్యవర్గ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడిల కుమార్ మాట్లాడుతూ ఎంపీటీసీలకు రావాల్సిన విధులు, నిధులు అధికారాలు, సమస్యల పరిష్కారం కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి తన్నీరు హరీశ్‌రావుల దృష్టికి తీసుకెళ్లామని, శాసన మండలిలోనూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమ సమస్యలను ప్రస్తావించారన్నారు. ఆ మేరకు రూ.500 కోట్లు ప్రకటించారని గుర్తు చేశారు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెట్పీటీసీలు, కౌన్సిలర్ ఓట్లతో జరిగే ఎన్నికలు కావడంతో కార్యవర్గం సలహా మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, రాష్ట్ర నాయకులు మాణిక్య రెడ్డి, వరకుమార్ పాల్గొన్నారు.