
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 3 : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గల నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతే లక్ష్యంగా అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెదక్ మున్సిపాలిటీ రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచింది. రాష్టంలోని మున్సిపాలిటీలు (50 వేల జనాభాలో)ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనగా అందులో అయా విభాగాల్లో సాధించి న పాయింట్ల ఆధారంగా మెదక్ మున్సిపాలిటీ పదో స్థానంలో నిలువగా.. సౌత్‌జోన్ స్థాయిలో 319 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 27వ ర్యాంక్ సాధించింది. గతేడాది సౌత్‌జోన్ పరిధిలో 24వ స్థానం, రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం సాధించింది. పట్టణాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత, మెరుగైన సేవలు, ప్రజలకు అవగాహన, ఇంటింటికెళ్లి చెత్త సేకరణ, తడి, పొడి చెత్త వేరు చేయడం, బహిరంగ మూత్ర విసర్జన నిర్మూలన, ప్లాస్టిక్ నిషేధం వంటి వాటిలో గణనీయమైన పురోగతి సాధించినందుకు స్వచ్ఛసర్వేక్షణ్-2021లో మెరుగైన ర్యాంకు సాధించిన గతేడాది కంటే ర్యాంకులు దిగజారడం గమనర్హం.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
పట్టణంలో బల్దియా సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 50,848 వేల జనాభా ఉండగా 2021 వరకు ఆ సంఖ్య పెరిగింది. మొత్తం 32 వార్డులు ఉండగా ప్రతి రోజు సుమారు 30 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం, సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి డంపింగ్‌యా ర్డులో ఎరువుగా మార్చడం, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపర్చడం నిత్యం జరుగుతున్నాయి. ప్రజల సౌకర్యార్థం పట్టణంలో ఐదు చోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. చెత్తను తరలిచండానికి 8 ట్రాక్టర్లు, ఆరు టాటా ఏసీలను ఉపయోగిస్తున్నారు. మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కా గా అమలు చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పలు అంశాల వారీగా కేంద్ర బృందం సభ్యులు వచ్చి పరిశీలించారు. ఆ సమయంలో వారు సంబంధింత అంశాలకు పాయింట్లు కేటాయించారు. మొత్తం ఆరు వేల పాయింట్లకు మూడు వేల లోపే పాయింట్లు సాధించింది.
మెరుగైన ర్యాంకు కోసం కృషి చేస్తాం
రాష్ట్రస్థాయిలో పదో స్థానం, సౌత్‌జోన్ స్థాయిలో 27వ ర్యాం కును సాధించాం. వచ్చే 2022 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు కోసం కృషి చేస్తాం. ఇప్పటి నుంచే పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. రద్దీ ప్రాం తాల్లో టాయిలెట్లు ఇప్పటికే నిర్మించాం. మరి కొన్ని నిర్మిస్తాం. పాలకవర్గంతో కలిసి మెదక్ మున్సిపాలిటీని మొదటి స్థానంలో నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేస్తాం.
-శ్రీహరి, మెదక్ మున్సిపల్ చైర్మన్