మెదక్ మున్సిపాలిటీ, మార్చి 30 : అనుమతులు లేకుండా లే-అవుట్లు, వెంచర్లు ఏర్పాటు చేసి, ప్లాట్లు విక్రయిస్తున్నారని.. పట్టణ ప్రణాళిక అధికారి దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని, వెంటనే విక్రయాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ వనజ మాట్లాడుతూ.. 6వ వార్డులోని సర్వే నంబర్ 538, 539, 540, 541లో సుమారు 3 ఎకరాల 35 గుంటల స్థలంలో కొందరు రియల్టర్లు మున్సిపల్ నుంచి అనుమతులు లేకుండానే ప్లాట్లు విక్రయిస్తున్నారని, రాయిన్‌పల్లి నుంచి వచ్చే కాలువ(బఫర్ జోన్) సైతం క బ్జాను చేసి ప్రహరీ నిర్మిస్తున్నారని వివరించారు. దీనిపై టీపీవో కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తెచ్చారు.
అనుమతులు లేని ప్లాట్లపై చర్యలు తీసుకోవాలని టీపీవోను మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు. మున్సిపల్ అనుమతులు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయరాదని సబ్‌రిజిష్టర్ కార్యాలయానికి లెటర్ రాయాలని కమిషనర్‌కు సూచించారు. పట్టణ ప్రజలు సైతం అక్రమ లే-అవుట్లలో ప్లాట్లను కొనుగోలుచేసి మోసపోవద్దన్నారు. మాయ గార్డెన్ వద్ద అనుమతి లేకుం డా నిర్మాణాలు చేపడుతున్నారని వైస్ చైర్మన్ ఫిర్యాదు చేశారు. జూనియర్ కళాశాల మైదానంలో వాకర్ల కోసం లైటింగ్ సౌక ర్యం కల్పించాలని ఎమ్మెల్యే సూచించినా ఇప్పటివరకు లైటింగ్ ఏర్పాటు చేయలేదన్నారు. 17వ వార్డులో భగీరథ తాగునీటిని సరఫరా చేయాలని కౌన్సిలర్ లింగం కోరారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డీఈ మహేశ్‌ను ఆదేశించా రు.
చమాన్ నుంచి దయార వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కౌన్సిలర్లు వసంత్‌రాజ్, రాజలింగం కోరారు. గిద్దకట్ట శ్మశాన వాటికలో విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలని కౌన్సిలర్ కృష్ణారెడ్డి కోరారు. తాగునీటి నల్లా పైపుల కోసం తీసిన గుంతలను పూడ్చాలని కౌన్సిలర్ సుంకయ్య సూచించారు. విలీన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని కౌన్సిలర్లు విశ్వం, కిశోర్ సభ దృష్టికి తేగా, రాష్ట్రవ్యాప్తం గా ఇలాంటి సమస్య ఉందని మున్సిపల్ చైర్మన్ చెప్పారు.
పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులను నిలిపి వేస్తున్నారని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ తదితరులు డీఈ మహేశ్, ఏఈ సిద్ధ్దేశ్వరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని? బిల్లులు వెంటనే చెల్లిం చాలన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు ఆంజనేయులు, జయరాజ్, శేఖర్, శ్రీనివాస్, లక్ష్మీ నారాయణగౌడ్, సమయొద్దీన్, కల్యాణి, జయశ్రీ, లక్ష్మి, మమత, సులోచన, గాయత్రి, నిర్మల, లలిత , చందన, రుక్మిణి, మేఘమాల, ఏఈ బాలసాయగౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని తీర్మానం
యాసంగిలో ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని మున్సిపల్ వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గౌరవ సభ్యులు ఆమోదించారు. తీర్మాన పత్రాలను ప్రధాని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి పోస్టులో పంపించారు.