గుమ్మడిదల,మార్చి21: దక్షప్రజాపతి గర్వాన్ని భగ్నం చేయడానికి శివుడి జటాజూటం నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా కోవెలలో పూజలందుకుంటున్నారు. బొంతపల్లిలో స్వయంభు వీరభద్రుడిగా వెలసిన స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 22 నుంచి వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన బొంతపల్లి
వీరన్నగూడెం భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. వెయ్యి ఏండ్ల చరిత్రగల పుణ్య శైవక్షేత్రంలో ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాలకు పొరుగురాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ర్టల నుంచే కాక జంటనగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి భక్తులు అధికంగా హాజరుకానున్నారు. 22న మహా గణపతిపూజ, స్వస్తివచనం, అఖండ దీపారాధనతో అంకుర్పాణ జరగనున్నది. ఆలయ కమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్ గుప్తా, ధర్మకర్తలు, బొంతపల్లి, వీరన్నగూడెం సర్పంచ్‌లు ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, మమతావేణు, ఆలయ వతనుదారులు, అర్చకులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. మొదటి రోజు రాత్రి 9 గంటలకు నందీశ్వరవాహన సేవ. 23న రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ, 24న హంసవాహన సేవ, 25న బృంగీశ్వరవాహన సేవ, 26న పొన్నవాహన సేవ, అగ్నిగుండాలు, 27వ తేదీన మధ్యాహ్నం భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం, 28 రాత్రి స్వామి వారి విమాన రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. 29న దోపుసేవ, మిరిమిడి, పూర్ణాహుతి, 30న ఏకాంతసేవ, డోలోత్సవాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు. బ్రహ్మోత్సవాల్లో నిత్యం అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ భద్రప్ప తెలిపారు.
వైభవంగా ఉత్సవాల నిర్వహణ
రెండేళ్ల నుంచి కరోనా ప్రభావం తో బ్రహ్మోత్సవాలను పరిమిత సంఖ్యలో భక్తులతో నిర్వహించాం. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గినందున ఉత్సవాలను అంగ రంగ వైభవంగా నిర్వహిస్తాం. భక్తుల నుంచి సేకరించిన రూ.కోట్ల విరాళాలతో నలుదిక్కులా రాజగోపురాలు నిర్మించాం. బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు జిల్లా నాయకులు హాజరుకానున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారికి కోరిన కోర్కెలు తీరుతాయన్న విశ్వాసం ఉంది.
– గటాటి భద్రప్ప, ఆలయకమిటీ చైర్మన్, బొంతపల్లి
బ్రహ్మోత్సవాలకు పూర్తి ఏర్పాట్లు చేశాం
బ్రహ్మోత్సవాలకు ఆలయంలో పూర్తి ఏర్పాట్లు చేశాం. 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను నిరాబండ రంగా వైభవంగా నిర్వహించనున్నాం. బ్రహ్మోత్సవాల్లో భాగం గా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాం. అధిక సంఖ్యలో భక్తులు బ్రహోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలి. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నాం. బొంతపల్లి, వీరన్నగూడెం పంచాయతీ పాలకవర్గం, పూర్వ ధర్మకర్తల సహాయ సహకారాలతో ఉత్సవాలు నిర్వహిస్తాం.
– శశిధర్‌గుప్తా, ఈవో, వీర భద్రస్వామి దేవాలయం, బొంతపల్లి