కంగ్టి, మార్చి 21: జిల్లాలోనే మారుమూల మండలం కంగ్టి. కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో పాటు ఎక్కడా చూసిన పడావు భూములు ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కో రైతుకు పదేసి ఎకరాలున్నా అంతంతమాత్రంగానే పంటలు పండుతాయి. వర్షాధార పంటలపైనే అక్కడి రైతులు ఆధారపడుతారు. దీంతో ఒక్క పంటమాత్రమే పండించుకుంటారు. దీనికి కారణం సాగునీరు లేకపోవడం, బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం. చాలా గ్రామాల్లో గట్టుప్రాంతభూములు ఉండడంతో వర్షాకాలంలో భూగర్భజలాలు ఇంకకుండా కాలువల గుండా వెళ్లిపోతాయి. దీంతో భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో ఉండవు. దీంతో నాబార్డు వారు మండలంలోని కొన్నిగ్రామాల్లో వాటర్‌షెడ్ పథకాలను అమలు చేస్తుడడంతో అవి సత్ఫలితాలిస్తున్నాయి.
భూగర్భజలాల అభివృద్ధికి దోహదం
వర్షాకాలంలో వరద నీరు వృథా కాకుండా వాటర్‌షెడ్ పథకంలో గట్టుప్రాంత భూముల్లో చుట్టూరా 4 అడుగుల మేర కందకాలు తవ్వుతున్నారు. గతేడాది మండలంలోని బోర్గి, చౌకన్పల్లి, భీంరా తదితర గ్రామాల్లో కందకాలు తవ్వడంతో చాలా వరకు సత్ఫలితాలిచ్చాయి. కందకాల్లో నీళ్లు నిల్వ ఉండడంతో వరదనీళ్లు భూమిలోకి ఇంకడంతో అక్కడి భూముల్లో భూగర్భజలాలు వృద్ధి చెందాయి. రైతులు తమ పంట పొలా ల్లో వ్యవసాయ పనులకు కందకాల్లో నిల్వ ఉన్న నీళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పంటలకు పిచికారీ చేసేప్పుడు రైతులు ఎంతో దూరం నుంచి నీటిని తీసుకొచ్చేవారు. నిల్వ ఉన్న నీళ్లు ఎంతో సౌకర్యంగా మారాయి. కందకాల తవ్వకంతో పాటు రైతులకు అవసరమైన చోట తమ భూముల్లో ఫాంపాండ్లు, బావులు కూడా వాటర్‌షెడ్ పథకాల్లో ఉండడంతో చాలా మంది వీటిని ఉపయోగించుకుంటున్నారు.
సబ్సిడీపై పరికరాలు
వాటర్‌షెడ్ పథకంలో భాగంగా ఆయాగ్రామాల్లో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను కూడా అందిస్తున్నారు. రూ.35 వేల విలువగల డ్రమ్ సీడర్లను రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. 70శాతం సబ్సిడీతో నీటిసౌకర్యం కలిగిన రైతులకు స్ప్రింక్లర్లను సైతం అందజేశారు. వానాకాలం పంటలో భాగంగా రైతులకు ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలు ఉచితంగా అందజేశారు. ఇటీవల కంగ్టిలోని పీహెచ్సీలో వైద్య సిబ్బందికి మెడికల్ కిట్లు అందజేశారు. వాటర్‌షెడ్ పథకం రైతులకు ఎంతో దోహదపడుతుండడంతో ఈపథకాన్ని మరికొన్ని గ్రామాల్లో సైతం అమలు చేయాలని ఆయాప్రాంతాలకు చెందిన రైతులు కోరుతున్నారు.