సిద్దిపేట, మార్చి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేదాక తగ్గేదేలే అంటున్నది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశానికి జిల్లా మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ చైర్మన్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు తరలివెళ్లారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ తరహాలో తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వివిధ రూపాల్లో తమ నిరసనలు, ఉద్యమాలు చేసే విధంగా కార్యాచరణను పార్టీ అధిష్టానం రూపొందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ రైతుల పక్షాన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చింది. పార్టీ ఎప్పటికప్పుడు ఇచ్చిన పిలుపును విజయవంతం చేసేలా కార్యకర్తలు సిద్ధం కావాలని అధినేత సూచించారు. ఇందులో భాగంగా ఈనెల 24న అన్ని నియోజకవర్గ స్థాయిలో విస్త్రతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ విధివిధానాలను పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్తులో పార్టీ ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపు మేరకు కార్యక్రమాలు విజయవంతం చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు. రైతుల పక్షాన నిలబడి బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, డీసీసీబీలు, సహకార సంఘాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మొత్తం ధాన్యం కొనాలని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తారు. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు, మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, సహకార సంఘాల్లో తీర్మానాలు చేస్తారు. ఈ తీర్మానాల కాపీలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఇవన్ని ఉగాదిలోపు పూర్తి చేయనున్నారు. తదనంతరం పార్టీ ఇచ్చే పిలుపునకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను రైతులతో కలిసి నిర్వహించనున్నారు.
గతంలో వలసలు…
గతంలో సాగునీరు లేక మనవద్ద సరిగ్గా పంటలు పండలేదు. రైతులు, కూలీలు వలస పోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సాగునీరు రాగానే వలసలు వాపస్ వచ్చాయి. ఉన్న ఊళ్లోనే పంటలు పండించుకుంటున్నారు.చేతినిండా పని దొరుకుతున్నది. రైతుల సంబుర పడుతున్న సమయంలోనే కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష సాధింపులకు దిగడంతో అన్యాయం జరుగుతున్నది. గత వాన కాలం నుంచి రైతుల ధాన్యం కొనుగోలు చేయడానికి సవాలక్ష కారణాలు చూపుతూ, ఇక్కడి రైతులను కేంద్రం ఆగంచేస్తున్నది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ టీఆర్ఎస్ పోరాటాలు చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదు. ప్రస్తుతం వేసిన పంటను సైతం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడం లేదు. మరో నెల రోజుల్లో యాసంగి ధాన్యం రైతుల చేతికి వస్తుంది. ఈ లోపు కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకొని రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలకు టీఆర్ఎస్ తన కార్యాచరణను ప్రకటించింది. ఈ నెలలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. రైతులు సైతం పెద్ద ఎత్తున ఉద్యమానికి తరలిరానున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో గణనీయంగా పెరిగిన వరి సాగు
సమైక్య పాలనతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చారు. పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. వీటి ఫలితాలు మూడేండ్లుగా రైతులకు అందుతున్నాయి.ఫలితంగా ప్రతి గుంట సాగులోకి వచ్చింది. రెండు మూడేండ్ల నుండి వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గత యాసంగితో పొల్చుకుంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వ సూచనతో రైతులు వరిని కొంత తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో వరి విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుత యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 2,40,350 ఎకరాలు, మెదక్ జిల్లాలో 1,67,275 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1,37,100 ఎకరాల్లో వరి సాగులో ఉంది. కేంద్రం పూర్తిగా ధాన్యం కొనకుంటే మన రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది.