జిన్నారం, మార్చి 21: పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమలు నిషేధిత డ్రగ్స్ తయారీకి కేంద్రాలుగా మారా యి. మూతబడిన, సిక్ పరిశ్రమల్లో డ్రగ్స్ తయారీ జరుగుతున్నది. డ్రగ్ కంట్రోలర్, నార్కోటిక్ డిపార్ట్మెంట్ల నుంచి అనుమతి లేకుండానే కొందరు నిషేధిత డ్రగ్స్ తయారు చేసి అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడల్లో టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ అధికారుల దాడుల్లో దొరికిన డ్రగ్స్ మూతబడిన, సిక్ పరిశ్రమల్లో తయారు చేస్తున్నవే కావడం గమనార్హం. పటాన్చెరు నియోజకవర్గ పారిశ్రామిక వాడల్లోనే ఈ ఘటనలు జరుగుతుండడానికి కారణం సిటీకి దగ్గరగా ఉండడం, డ్రగ్స్‌ను సరఫరా చేయడానికి రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండడమే. పైగా పారిశ్రామిక వాడలు ఉండడంతో ఎవరికీ అనుమానాలు రాకుండా మాఫియా ఈ ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నియోజకవర్గంలోని పటాన్చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, ఐడీఏబొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామిక వాడలున్నాయి. ఈ వాడల్లో నిషేధిత డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ప్రజలు భయాం దోళనలు చెందుతున్నారు.
రూ.42కోట్ల డ్రగ్స్ పట్టివేత
జిన్నారం మండలంలోని ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో నిషేధిత డ్రగ్స్ తయారు చేసి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తుండగా సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు బెంగళూరులో పట్టుకున్నారు. అధికారులు పట్టుకున్న ఈ డ్రగ్ విలువ రూ.42 కోట్ల పైమా టే. కాగా పట్టుబడిన డ్రగ్స్‌ను తయారు చేసింది బొల్లారం పరిశ్రమలో కాదని నార్కోటిక్ అధికారులు జరిపిన విచారణలో తేలడంతో ఆ పరిశ్రమకు క్లీన్ చీట్ ఇచ్చారు. పటాన్చెరు మండలం సుల్తాన్పూర్ పంచాయతీ పరిధిలోని గండిగూడెం గ్రామంలో వార్వే అనే పరిశ్రమలో ఎలాంటి అనుమతులు లేకుండా నిషేధిత అల్ఫాజోమ్ అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తుండ గా టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఇందులో 149 కిలోల ఆల్ఫాజోమ్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 150 కిలోల ఆల్ఫాజోమ్ డ్రగ్ అమ్మినట్లు అధికారులు తేల్చారు. అమ్మిన డ్రగ్ విలువ సుమారు రూ.80 లక్షలు కాగా అధికారుల దాడిలో దొరికిన డ్రగ్ విలువ రూ.75 లక్షలు. ఈ రెండు ఘటనలు కూడా 2016లో జరిగినవే. నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేస్తున్న వాటిలో ఒకటి, రెండు పరిశ్రమలే బయటపడ్డాయి. గుట్టుచప్పుడు కాకుండా కొన్ని పరిశ్రమలు డ్రగ్స్ తయారు చేసి దళారుల ద్వారా చీకటి మార్కెట్లోకి తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పారిశ్రామికవాడల్లో పలు పరిశ్రమలు ఒకదానికి తీసుకుని అనుమతి తీసుకుని మరొకటి ఉత్పత్తి చేస్తున్నాయి.
2016లోనే డ్రగ్స్ తయారీ ఘటనలు
2016లో పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పారిశ్రామిక వాడల్లో నిషేధిత డ్రగ్స్ తయారీ చేస్తున్న పరిశ్రమల్లో అధికారులు దాడులు చేసి పట్టుకున్న సంఘటనలు మూడు. అక్టోబర్ 4న బొల్లారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో, డిసెంబర్ 7న పటాన్చెరు మండలంలోని గండిగూడెం వార్వే పరిశ్రమలో, డిసెంబర్ 23న గుమ్మడిదల మండలంలోని అనంతారం గ్రామ శివారులోని వెంకటరాఘవ ల్యాబ్ లో అధికారులు దాడులుచేశారు. బొల్లారం పరిశ్రమలో నిషేధిత డ్రగ్స్ తయారు చేసి తరలిస్తుండగా అక్టోబర్ 4న బెంగళూరులో సెంట్రల్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో అధికారులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.42 కోట్లు. డిసెంబర్ 7న పటాన్చెరు మండలంలోని గండిగూడెం సమీపంలో వార్వే పరిశ్రమలో రాష్ట్ర టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఇందులో 149 కిలోల అల్ఫాజోమ్ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా గుమ్మడిదల మండలంలోని అనంతారం గ్రామ శివారులో మూసి ఉన్న వెంకటరాఘవ ల్యాబ్ పరిశ్రమలో ఆల్ఫోజోమ్ డ్రగ్‌ను తయారు చేస్తుండగా రెవెన్యూ నిఘా విభాగం దాడులు చేసి 132 కిలోలు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3కోట్ల వరకు విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. రెండేండ్ల క్రితం బొల్లారంలోని ఓ సిక్ ఇండస్ట్రీలో డ్రగ్స్ తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుండగా బెంగళూరులో టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. గతేడాది గడ్డపోతారంలోని మెకా ల్యాబ్‌లో డ్రగ్స్ తయారీ, తాజాగా గడ్డపోతారంలోని లూసెంట్ పరిశ్రమలో ఘటన కలకలం సృష్టించింది.