గజ్వేల్ రూరల్, మార్చి 19: సింధువే ఎగిసొచ్చి నదికి ప్రాణం పోసింది. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ కెనాల్ నుంచి గోదావరి జలాలను మంత్రి హరీశ్‌రావు కూడవెల్లి వాగులోకి విడుదల చేయగా, రైతుల ముఖాల్లో ఆనందం రెట్టింపు అయ్యింది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజల అనంతరం గోదారమ్మకు పూలు, పసుపు, కుంకుమ చల్లారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కూడవెళ్లి వాగులోకి నీటి విడుదలను బటన్ ఆన్‌చేసి వదిలారు. ఒక్కసారిగా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ కూడవెల్లి వాగులోకి చేరుతుండగా.. అక్కడికి వచ్చిన రైతులు ఎంతో ఉత్సాహంతో కనిపించారు. యాసంగి పంటలను దక్కించుకునే విధంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవ చూపడంతో గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. ఒకటి, రెండు రోజుల్లోనే కూడవెల్లి వాగు నిండుకుండలా కనిపించనున్నది. టీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి నాగలి బహూకరించారు.
నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే..
కాలంతో పనిలేకుండా పంటపొలాలకు నీరిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని, యాసంగి పంటలు ఎండిపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గోదావరి జలాలను తీసుకొచ్చి, రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నారని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ కెనాల్ నుంచి కూడవెల్లి వాగుకు, యాదాద్రి జిల్లాలోని గండి చెరువుకు గోదావరి జలాలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన వదిలారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎక్కడో ఉన్న గోదావరి జలాలను తెచ్చి బీడుభూములను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. 618 మీటర్ల ఎత్తు నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వాటిని అధిగమించి సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసి కాలువల్లో గోదావరి జలాలు పారించారన్నారు. ఎరువులు, కరెంట్ కొరత లేకుండా చేశారన్నారు. ఇంత చేస్తుంటే విమర్శలు చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రతిపక్షాలను మంత్రి ప్రశ్నించారు.
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు…
రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో 2.50లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదన్నారు. రైతులు పామాయిల్ సాగుకు ప్రాధాన్యమివ్వాలని, ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు లాభం వస్తుందని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు బడ్జెట్లో రూ.1000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. పామాయిల్ తోటలు పెంచేవారికి రాయితీపై డ్రిప్‌ను ప్రభుత్వం ఇస్తున్నదని, జిల్లాలో 30వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, పంటను సాగుచేసే వారు ఏఈవోలను సంప్రదించాలని సూచించారు.
రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక ప్రాంత రైతులు సాగు చేసిన వరిపైరు పొట్టకొచ్చే దశకు రావడంతో నీటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేసేలా చూడాలని మంత్రి హరీశ్‌రావును కోరాం. నీటి విడుదలకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు. రైతుల బాగు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమం విజయవంతంగా పూర్తయి, నేడు సాగు నీరందడం నిజంగా రైతులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నం.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ
గోదావరి జలాలతో యాదాద్రీ నృసింహస్వామి పాదాలు కడుగుతాం..
ఈ సందర్భంగా రైతులను ఆకట్టుకునేలా మంత్రి హరీశ్‌రావు చేపపిల్ల కథ చెప్పి, నవ్వించారు. యాదాద్రి జిల్లా గండి చెరువు గోదావరి జలాలతో నిండగానే, ఆ నీళ్లతో లక్ష్మీనృసింహస్వామి పాదాలు కడుగుతామన్నారు. ఇటీవల కొమురవెళ్లి మల్లన్న స్వామికి చేసిన అభిషేకం మాదిరిగానే, లక్ష్మీనృసింహస్వామి పాదాలను గోదావరి జలాలతో కడుగుతామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ ప్రాజెక్టుల ఈఎన్సీ హరిరామ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఎస్ఈలు వేణు, శ్రీనివాస్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, నాయకులు గాడిపల్లి భాస్కర్, దేవి రవీందర్, పండరి రవీందర్రావు, ఉడేం కృష్టారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీ అశోక్, మండలాధ్యక్షుడు మధు, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజంగా రైతుల అదృష్టం..
రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి.వారు ఆర్థికంగా ఎదగాలని ఎప్పుడూ తాపత్రాయపడే వ్యక్తి సీఎం కేసీఆర్. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లు నిర్మించి, ఈ ప్రాంత రైతులకు ఆయన దేవుడయ్యారు. ఎండలు మండుతుంటే వాగుల్లో పుష్కలంగా నీళ్లు కనిపించే స్థాయికి తెలంగాణ ఎదగడం నిజంగా రైతుల అదృష్టం. ప్రభుత్వం ఎప్పుడూ రైతుల సంక్షేమానికే పనిచేస్తున్నది. నీళ్లను చూసి రైతులు సంబుర పడుతున్నారు.
– వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్
కేసీఆర్ అన్నంత పనిజేస్తుండు కదా..!
పొయిన కారే నీళ్లు ఇడిసిన్రు.. మళ్ల ఇంత బిరానా నీళ్లొస్తయని అనుకొలేదు. ఓ పక్క ఎండలు దంచికొడుతున్నయ్.. అవునే రాజన్న.. కేసీఆర్ సారు అన్నంత పని చేస్తుండు కదా!.. అవునే నర్సన్న.. గిట్ల ఎవరన్న సర్కారోళ్లు ఇంతకు ముందెన్నడు శెప్పిన మాట మీద నిలబడ్డరాయే. ప్రాజెక్టు కట్టడమేంటిది.. ఎక్కడో ఉన్న వాగు నుంచి నీళ్లు తెచ్చి, మన పంట పొలాలకు పారించడమేంటిది. శెతనీళ్లకు బాధలేదు.. దూప నీళ్లకు బాధలేదు.. అని వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన సింధం రాజయ్య, రామక్కపేటకు చెందిన ర్యాకల నర్సయ్య అనే వృద్ధులు గోదావరి జలాల విడుదల చూసి ఇలా ముచ్చటించుకున్నారు.
– వృద్ధులు సిందం రాజయ్య-ర్యాకల నర్సయ్య
చెట్టూ చేమకు మంచిదే..
సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్‌ను కట్టి రైతన్నలకు ఎంతో మేలుచేసిండు. ఈ రోజు ప్రాజెక్టు నుంచి కాలువలోకి నీళ్లు ఇడవడం వల్ల గొడ్డూగోదకే కాకుండా చెట్టూ చేమకు మంచిదే. ఎండుతున్న పంట చేన్లకు గోదావరి నీళ్లు ప్రాణం పోస్తాయి. చెరువు, కుంటలు నిండడమే కాకుండా పశువుల మేతకు కూడా ఇబ్బంది ఉండదు.
– కనకయ్యగౌడ్, గీత కార్మికుడు, వర్గల్