మెదక్‌రూరల్, మార్చి19: కొండెక్కిన చికెన్ ధరలు మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండగలకు, పబ్బాలకు, ఆదివారం వస్తే అలవాటుగా చాలామంది నాన్‌వెజ్ తిందామనుకుంటారు. కానీ ధరలు పెరగడంతో సామాన్యులు చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా చికెన్ కిలో ధర రూ.281 పెరిగింది. ఫిబ్రవరి 7న కిలోరూ.185 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.281. దీనికి తోడు వంట నూనెలు, కూరగాయలు, పప్పుల ధరలూ పెరగడంతో ఏం తినేటట్లు లేదని ప్రజలు వాపోతున్నారు. చికెన్ వినియోగం పెరగడం, ఎండలు మండిపోతుండడంతో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే నెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ కిలో ధర రూ.300కు పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో చికెన్ తినడం కష్టమే అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చికెన్ కొనలేకపోతున్నాం..
మటన్, చికెన్ తినడం అలవాటు. మటన్ రేటు పెరగడంతో చికెన్ తీసుకునేవాడిని. ఇప్పుడు చికెన్ రేటు పెరగడంతో అది కూడా కొనలేక పోతున్నాం. వారానికోసారి అర కిలో మాత్ర మే తీసుకెళ్తున్నా. ఇలాగే రేట్లు పెరిగితే సామాన్యులు చికెన్ తినడం కష్టంగానే ఉంటుంది.
– శ్రీకాంత్, వెంకటాపూర్
గిరాకీ బాగా తగ్గిపోయింది
చికెన్ ధరలు పెరగడంతో ప్రజలు చికెన్ కొనడానికి ఆసక్తి చూపడంలేదు. బర్డ్‌ప్లూ ప్రచారంతో పౌల్ట్రీ యజమానులు కోళ్ల ఉత్పత్తిని నిలిపేశారు. ఇప్పుడు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. గతంలో రోజుకు క్వింటాల్ చికెన్ విక్రయించేంది. రేట్లు పెరగడంతో రోజూ 50 కిలోలు కూడా అమ్మడంలేదు. – నాగారాజు, షాప్ నిర్వాహకుడు