రాయికోడ్, మార్చి19: ఇంగ్లిష్ మీడియం చదవాలన్న పేదల కల సాకారమవుతున్నది. పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు.. మన బడి కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ప్రవేశపెడుతున్నది. ఇందులో భాగంగా మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రవేశపెట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించేలా నిధులు మంజూరు చేయనున్న తరుణంలో సర్కారు బడి సరి కొత్త కళ వచ్చినైట్లెంది. గ్రామస్తుల కోరిక, ఉపాధ్యాయుల చొరవతో మండలంలోని నాగన్‌పల్లి పాఠశాలలో మూడేండ్లుగా ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన కొనసాగుతున్నది. మారుమూల గ్రామమైనప్పటికీ ఆంగ్ల మాధ్యమంలో 56 మంది విద్యార్థులున్నారు.
పూర్వ విద్యార్థుల సహకారంతో..
పాఠశాల అభివృద్ధిలో పలువురు పూర్వ విద్యార్థులు భాగస్వాములువుతున్నారు. ఇక్కడ చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. తమవంతు సాయంగా ఏటా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తున్నారు.
బోధనేతర కార్యక్రమాలకూ ప్రాధాన్యత
విద్యతోపాటు విద్యార్థులకు బోధనేతర కార్యక్రమాలపై హెచ్ఎం యూసుఫ్ శిక్షణ అందిస్తున్నారు. క్రీడలు, క్విజ్, చిత్రలేఖనం, జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలో ఒక్క అక్షరం – ఒక్క వస్తువు అనే కార్యక్రమం ద్వారా 360 వస్తువులు తయారు చేస్తున్నారు.
ఇంగ్లిష్ మీడియం.. కోరిక తీరింది
నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదవాలన్న కోరిక ఉండేది. మా కుటుంబ పరిస్థితులు అం దుకు అనుకూలంగా లేవు. దీంతో కలగానే మిగిలిపోతుందనుకున్నా. కానీ మా స్కూల్లో ఇంగ్లిష్ మీడి యం ప్రారంభించడంతో నా కల నెరవేరింది. ప్రస్తు తం ఇంగ్లిష్ మీడియంలో 4వ తరగతి చదువుతున్నా. హెచ్ఎం సార్ మంచిగా ప్రోత్సహిస్తున్నారు.
– భావానీ, 4వ తరగతి, విద్యార్థిని
ఆంగ్ల విద్య.. విద్యార్థులకు వరం
ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం పేద విద్యార్థులకు వరం. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో గతం లో ఆంగ్ల విద్యకు దూరమయ్యా రు. దీంతో పోటీ పరీక్షల్లో రాణించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన మన ఊరు-మనబడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయి. మా పాఠశాల ఎంపిక కావడం విద్యార్థుల ఆదృష్టంగా భావిస్తున్నాం.
– యూసూఫ్, ప్రధానోపాధ్యాయుడు