ఝరాసంగం,మార్చి19: శనగల కొనుగోలు కేంద్రాలకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని రాష్ట్ర ప్రభత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు పాలిటి వరంగా మారింది. సీఎం కేసీఆర్ ఆశించిన ఫలితాలు రైతులకు అందుతున్నాయి. ఈనెల 3న ఝరాసంగంతో పాటు ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మార్కెట్ అధికారులు, ఏఎంసీ, పీఎంసీ చైర్మన్లు కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
వారం రోజుల్లో 35 వేల క్వింటళ్లు కొనుగోలు
మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు పండించిన శనిగ పంటను వారం రోజులో 35వేల 17 వందల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు కేంద్రం కార్యదర్శులునిస్సార్ అహ్మద్, శ్రీశైలం తెలిపారు. ప్రతి రోజు 200 క్వింటాళ్లు నుంచి సుమారుగా 1600 వందల క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటలుకు రూ.5230 చొప్పున శనిగలు కొనుగోలు చేయడంతో రైతులు కేంద్రానికి భారీగా ధాన్యం తీసుకొస్తున్నారని అన్నారు.
దళారులకు చెక్
బయటి మార్కెట్ వ్యాపారులు పెట్టే ధర కన్నా మార్క్ఫెడ్ కేంద్రంలో క్వింటాలుకు రూ.500 తేడాఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండిచిన కంది, శనగ పంటలు విక్రయించేందుకు భారీగా ధాన్యంతో రైతులు వస్తున్నారు. మండలంలోని ఝరాసంగంతోపాటు, కుప్పానగర్, ఎల్గొయి, పోట్పల్లి, బర్దీపూర్, ఈదులపల్లి, జీర్లపల్లి, బిడెకన్నె, చీలేపల్లి, వనంపల్లి, కప్పాడ్, కమాల్పల్లి, కొల్లూర్ తదితర గ్రామాలతో పాటు న్యాల్కల్, రాయికోడ్ రైతులు శనిగ లు తీసుకురావడంతో ఝరాసంగం, ఏడాకులపల్లి కేంద్రాలు సందడిగా మారాయి.
చిన్న, సన్నకారు రైతులకు మేలు
ప్రభుత్వం కల్పించిన ఈ మద్దుతు ధరకు పెద్ద రైతులే కాకుండా చిన్న, సన్న కారు రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనగలు విక్రయిచేందుకు ఆధార్ కార్డు, పట్టాపాసుబుక్, బ్యాంక్ ఖాతానంబర్, జిరాక్స్లను కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకుని రావాలి. రైతులు నాణ్యమైన, తేమ లేకుండా పంటను కేంద్రానికి తీసుకొస్తేనే ప్రభుత్వం నిర్ణయించిన ధర వస్తుంది.
ఎక్కువ ధర వస్తున్నది
బయటి మార్కెట్ కంటే ప్రభుత్వం ఎక్కువ ధరకు ధాన్యం కొంటున్నది. అందుకే ఇక్కడికి తెచ్చాం. షావుకార్ల దగ్గరకు తీసుకుపోతే ఏవేవో కారణాలు చెప్పి వాళ్లు అ డిగిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రభు త్వం మద్దతు ధర పెట్టి మాకు మంచిగా చేసింది. డబ్బు లు బ్యాంక్ ద్వారా రైతుల ఖాతాలోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సంగారెడ్డి రైతు, కక్కర్వాడ
కేంద్రంలోనే విక్రయించాం
శనిగ ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. దీంతో కొనుగోలు కేంద్రం కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాం. ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రత్యేక చొరవ చూపడంతో కొనుగోలు కేంద్రాలు మండలంలో ప్రారంభించడం అభినందిస్తున్నాం. ఇతర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకునేవాళ్లం. ఇప్పుడు రవాణా ఖర్చులు మిగిలిపోతున్నాయి.
– సంగ్రామ్పటేల్, రైతు, కుప్పానగర్