ఝరాసంగం, మార్చి14: మెట్ట ప్రాంతంలో వర్షాధారిత పంటలు పండిచే రైతులు వేసవిలో దుక్కులు దున్నడంతో అనేక ఉపయోగాలున్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పత్తి పంట తీసిన తరువాత కర్ర తీయడం, దాన్ని కాల్చేయడం చేస్తుంటారు. అలా చేస్తే భూమిలో ఉండే వానపాములు, మరికొన్ని మేలు చేసే క్రీములు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా బ్యాక్టీరియా ద్వారా పత్తి కర్రను నాశనం చేసే విధానాన్ని ఎన్నుకోవడం మంచి పద్ధతి. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులు ఎంచుకోవాలి. అందులో ఒకటి వేసవిదుక్కులు. వేసవి దుక్కులతో పంటకు మేలు కలుగుతుంది. గత నెల వరకు యాసంగి సాగులో పంట ముగిసిన చేళ్లలో కనీసం 9 అంగుళాల లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడంతో ఉండే ప్రయోజనాలను రైతులకు వివరిస్తున్నారు.
లోతు దుక్కులు భుమికి ఎంతో మేలు
దుక్కులు దున్నినప్పుడు పొలల్లో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేయడానికి అవకాశం ఉంటుంది. నేలలో ఉండే తెగుళ్లు కలుగ చేసే శిలీంద్రాలకు సూర్యరశ్మి సోకుతుంది ఏప్రిల్, మేలో అధిక ఉష్ణోగ్రతకు ఈ శిలీంద్రాలు నశిస్తాయి. తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. తుంగ, గర్క, దర్భ, జమ్ము, గుంజార వంటి ముడి జాతి కలుపు మొక్కలు చేళ్లలో పెరిగి, పంటలకు నష్టం చేస్తుంటాయి. వీటి వేర్లు నేలలో చాలా వరకు విస్తారిస్తాయి. వీటిని నివారిచడం చాలా కష్టమవుతుంది. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు మొక్కల పైర్లు, దుప్పలు పెకిలించబడుతాయి. దీంతో వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతతో అవి నశించిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుక్కి దున్నినప్పుడు నేలపైకి తేలిన వేర్లు, దుప్పలు ఏరివేయడంతో వచ్చే ఏడాది మళ్లీ ఇలాంటి మొక్కలు మొలువకుండా నివారించవచ్చు. వేసవిలో బాగా దుక్కి దున్నడంతో నేల బాగా గుల్లబారుతుంది. తొలికరిలో వేసే పైర్ల వేర్లు భూమిలో బాగా విస్తరించడానికి అనుకులంగా ఉంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, సారె, గుంటుకు వంటి పరికరాలు నేల లోపలకి సుమారుగా 3 నుంచి 5 అంగుళాల వరకు చొచ్చుకునిపోతాయి. దీంతో నేలకు నీటిని పిల్చుకునే శక్తి పెరుగుతుంది.
ప్రభుత్వ సాయంతో సాగు
పంట సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తున్నది. సకాలంలో విత్తనాలు, ఎరువులతో పాటు రైతు బంధు కూడా ఇస్తున్నది. ఎండాకాలంలో ఇతర పంటలు వేస్తూ దిగుబడులు సాధిస్తున్నాం. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌తో సాగు నీరు అందిచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేయడం సంతోషంగా ఉంది.
– దేవాదాసు, రైతు, బిడెకన్నె
పంట నూర్పిడి చేసిన వెంటనే దుక్కులు
పంట కోత తరువాత నేలను లోతుగా దున్నినప్పుడు నీటిని పిల్చుకునే శక్తి రేటింపు అవుతుంది. కోత తర్వాత నేలపై మిగిలే పంట మొదళ్లు, కలుపు మొక్కలు వివిధ పదార్థాలన్నీ లోతుగా దుక్కి దున్నడంతో నశిస్తాయి. దీంతో నేలలో సేంద్రియ శాతం, పోషక పదార్థాలు పెరుగుతాయి. పోడు వ్యవసాయానికి చెందిన భూములను దున్నుకోవడంతో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.
– వెంకటేశం, మండల వ్యవసాయ అధికారి, ఝరాసంగం