సంగారెడ్డి, మార్చి 12: కోర్టుల్లో కేసులు వేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్‌లు ఉపయోగపడుతాయని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌లను ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి ప్రారంభించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ సత్వర న్యాయానికి లోక్ అదాలత్‌లు ఎంతో ఉపయోగకరమని, న్యాయవాదుల సలహాలు పాటించి న్యాయం పొందాలన్నారు. ఈ లోక్ అదాలత్‌లలో 13,530 కేసుల పరిష్కారం చేసి బాధితులకు రూ.1,03,22,147 కోట్లను అందించామన్నారు. అలాగే, భూసేకర కేసుల్లో నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వం అందించిన పరిహారం 400 మందికి లబ్ధి చేకూరుతుందని రూ.11,52,69,190 కోట్ల పరిహారాన్ని ఇప్పించామన్నారు.
ముఖ్యంగా న్యాయవాదులు, కక్షిదారులకు సూచించిన విధంగా కేసులను రాజీ చేసుకుని ఆర్థిక ఇబ్బందులు, సమయం వృథాను ఆదా చేసుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లలో ఇరు పార్టీలకు సమన్యాయం చేసేందుకు కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు విధులు నిర్వహించే పోలీసులు సమన్వయం చేసుకోవడం సంతోషకరమన్నారు. దీంతో గ్రామాల ప్రజలతో పాటు, కోర్టు కేసులకు తిరుగుతున్న కక్షిదారులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ లోక్ అదాలత్‌లో ఏడో అదనపు జిల్లా జడ్జి కర్ణ కుమార్, రెండో అదనపు జిల్లా జడ్జి అనిత, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్, స్పెషల్ ఏక్సైజ్ కోర్టు జడ్జి హన్మంతరావు, స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి నిర్మల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ప్రభుత్వ న్యాయవాది, సీనియర్ న్యాయవాదులు, పోలీసు అధికారులు, కక్షిదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.